దీక్ష విరమణలకు పటిష్
ఆర్డీవో చైతన్య
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య చెప్పారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. తొలుత కనక దుర్గనగర్‌లో ఆర్డీవో చైతన్య, ఈవో శీనా నాయక్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. కెనాల్‌రోడ్డులో క్యూ పనులు, కనకదుర్గనగర్‌లో లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్లు, స్నానఘాట్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను పరిశీలించగా, దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులు పనులు జరుగుతున్న విధానాన్ని వివరించారు. మహామండపం వద్ద హోమగుండాలు, అన్నదానం, ఇరుముడులను సమర్పించే కౌంటర్లు, లడ్డూ తయారీ కేంద్రాలను పరిశీలించారు. కార్పొరేషన్, పోలీసు, రెవెన్యూ విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని చైతన్య పేర్కొన్నారు. ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ దుర్గగుడి ఈఈ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నూతన లడ్డూ పోటులో పూజా కార్యక్రమాలు
దీక్ష విరమణలను పురస్కరించుకుని మహా మండపం వద్ద మూడో లడ్డూ పోటుకు ఆలయ అధికారులు సోమవారం పూజలు చేశారు. మహా మండపం, గోశాల మధ్య దేవస్థానం నూతన భవనాన్ని నిర్మించింది. ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజలు చేసి అనంతరం పొయ్యిల వద్ద కొబ్బరికాయ కొట్టి లడ్డూ తయారీని ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీ నాటికి 5 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.


