రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన
హనుమాన్‌జంక్షన్ రూరల్: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. బాపులపాడు మండలం వీరవల్లిలో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మంత్రితో పాటు కలెక్టర్ డీకే బాలాజీ, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. తొలుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని రైతులకు ప్రదర్శించారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును పంపిణీ చేశారు.
వేగంగా ధాన్యం కొనుగోళ్లు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోని 1.34 లక్షల మంది రైతులకు రెండో విడతగా రూ.88.49కోట్లు మంజూరు అయినట్లు చెప్పారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయని, ఇప్పటికే ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ద్వారా 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. అనంతరం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు రూ.30 లక్షల విలువ చేసే టార్పాలిన్లు, పవర్ స్ప్రేయర్లు, సేఫ్టీ కిట్లు, దుప్పట్లు, క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు, విద్యార్థులకు సాల్కర్‌షిప్‌లను పంపిణీ చేశారు. తానా ఫౌండేషన్ ప్రతినిధి కలపాల శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, సర్పంచ్ పిల్లా అనిత, ఎంపీటీసీ సభ్యుడు అమృతపల్లి సూర్యనారాయణ, ఉప సర్పంచ్ లంక అజయ్, పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఇన్‌చార్జి
మంత్రి వాసంశెట్టి సుభాష్


