కట్ట తెగితే.. ఊరు మునకే!
ప్రస్తుతానికి అదనపు నీరు పోయేలా ఏర్పాటు చేశాం
జి.కొండూరు: ప్రజా ప్రతినిధులు, సాగునీటి శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. చెరువులో నీరు నింపండం ఎంత అవసరమో చెరువు సామర్థ్యానికి మించి నీరు వచ్చినప్పుడు దిగువకు పోయేందుకు కళింగ (సర్‌ప్లస్ వ్యూ) ఏర్పాటు కూడా అంతే అవసరం. ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు పంట చెరువు తీరు అందుకు భిన్నంగా ఉంది. ఈ చెరువుకు కళింగే లేకపోవడంతో చెరువు నిండు కుండలా మారి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ప్రజా ప్రతినిధులు అవకాశం దొరికినప్పుడల్లా ఇష్టారాజ్యంగా చెరువులో మట్టిని తోడుకొని ఆర్ధికంగా బలపడడం తప్ప చెరువు అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారు. దీంతో భారీ వర్షం కురిసినప్పుడల్లా ఏ క్షణాన చెరువు కట్ట తెగుతుందోనని రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
నిండు కుండలా చెరువు..
జి.కొండూరు పంట చెరువు గ్రామాన్ని ఆనుకొని 41.76 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద ఆయకట్టు 139 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం 8.193 మిలియన్ క్యూబిక్ అడుగులుగా ఉంది. ఈ చెరువుకు గడ్డమణుగు గ్రామ శివారులోని పులివాగు ఆనకట్ట నుంచి సప్‌లై చానల్ ద్వారా నీరు సరఫరా అవుతుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువుకు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో నీరు కూడా చెరువులోకి చేరుతోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు సామర్ధ్యం మించి నీరు నిండడంతో నిండు కుండలా మారి ఆందోళన కలిగిస్తోంది.
అదనపు నీరు పోయే మార్గం లేక..
గతంలో గ్రామం వైపుగా ఈ చెరువుకు కొద్దిపాటి కళింగ ఉండేది. చెరువులో నీరు ఎక్కువైనప్పుడు దీని ద్వారా స్థానిక పోలీసుస్టేషన్ ఆనుకొని ఉన్న కాల్వలో ప్రవహించి గ్రామం మధ్యలో ఉన్న పులివాగులో కలిసేది. అదేవిధంగా చెరువుకు వెనక భాగంలో లోతట్టుగా ఉన్న వ్యవసాయ భూముల మీదుగా ప్రవహించి దిగువకు వెళ్లి ఆత్కూరు కురిడి చెరువులోకి చేరేది. ప్రస్తుతం ఎటువంటి అవకాశం లేదు. చెరువుకు గతంలో ఉన్న కొద్దిపాటి కళింగకు ఎదురుగా ఉన్న పట్టా భూమిలో ప్రహరీ నిర్మించడం, కాల్వ సైతం ఆక్రమణలకు గురి కావడంతో చెరువులో అదనపు నీరు పోయే అవకాశం లేదు. అంతే కాకుండా ఉన్న కొద్దిపాటి కళింగ కూడా చెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా మారింది. చెరువుకు వెనక భాగాన భారీగా తుమ్మ చెట్లు పెరిగి చెరువు నిండినప్పుడు అదనంగా వచ్చిన నీరు అటు వైపు కూడా వెళ్లే అవకాశం లేదు. భారీ వర్షం కురిసినప్పుడు ఒకవేళ చెరువుకు గండ్లు పడితే ఆయకట్టు సాగు భూములతో పాటు జి.కొండూరు గ్రామం కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇకనైనా స్పందించి చెరువుకు కళింగ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
చెరువు అభివృద్ధిని గాలికొదిలేసి..
జి.కొండూరు గ్రామానికి ఆనుకొని పంట చెరువు ఉండడంతో రవాణాకు సులభతరంగా ఉండి స్థాని క ప్రజా ప్రతినిధులు ఈ చెరువులో మట్టిని విక్ర యించి సొమ్ము చేసుకోవడం తప్ప చెరువు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నా రు. చెరువుకు వెనక భాగంలో రెండు ఎకరాలలో భారీగా తుమ్మ చెట్లు, ముళ్ల కంప అల్లుకుపోయి ఉంటే దానిని తొలగించేందుకు ప్రజా ప్రతినిధులకు మనసొప్పడం లేదని, చెరువు కట్టకు కూడా తట్ట మట్టి వేయడం లేదని మండిపడుతున్నారు.
ప్రమాకరంగా జి.కొండూరుపంట చెరువు
కళింగ లేక ప్రమాదకరంగా
దర్శనమిస్తున్న వైనం
భారీ వర్షం కురిస్తే కట్టలు తెగే అవకాశం
ఆందోళనలో ఆయకట్టు రైతులు
జి.కొండూరు పంట చెరువుకు గ్రామం వైపు కొద్దిపాటి కళింగ ఉంది. ఇటీవల వర్షాలు పడుతున్న క్రమంలో కాల్వ పూడిక తీయించి చెరువులో అదనపు నీరు ఎన్‌ఎస్‌పీ కాల్వలో కలిసేలా చేశాం. చెరువుకు కళింగ ఏర్పాటుకు అనుకూల ప్రదేశాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం.
– టి.రాజేష్,
ఇరిగేషన్ ఏఈఈ, జి.కొండూరు
కట్ట తెగితే.. ఊరు మునకే!


