పంట నమోదు కోరుతూ రైతుల రాస్తారోకో
చల్లపల్లి: మోంథా తుపాను వల్ల సుంకు రాలిన వరి పంటను దెబ్బతిన్న పంటగా నమోదు చేయాలని కోరుతూ రైతన్నలు ఆందోళనకు దిగారు.
పైరు పడిపోకపోయినప్పటికీ సుంకు రాలిపోవటం వల్ల పంట దెబ్బతిందని అందువల్ల తమ పంట కూడా దెబ్బతిన్న పంటగా నమోదు చేయాలని లక్ష్మీపురం పంచాయతీకి చెందిన రైతులు చల్లపల్లి–మచిలీపట్నం ప్రధాన రహదారిపై బైటాయించి శుక్రవారం రాస్తోరోకో నిర్వహించారు. చుట్టుపక్కల మండలాల్లో వ్యవసాయ అధికారులు ఘంటసాల, దేవరకోట, దాలిపర్రు, లంకపల్లి గ్రామాల్లో పడిపోని పంటను కూడా నమోదు చేసుకున్నారని, కానీ చల్లపల్లిలో కేవలం పడిపోయిన పంట మాత్రమే నమోదు చేశారని రైతులు పేర్కొన్నారు. పంట నేలపై పడిపోనప్పటికీ తమ పంట దెబ్బతిందని దానికి కూడా నష్టపరిహారం ఇప్పించాలని చింతలమడ రైతులు డిమాండ్ చేశారు.
జాబితా కోసం పట్టు..
రైతుల రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో చల్లపల్లి ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమతి లేకుండా రాస్తారోకో చేయరాదని రాకపోకలకు అవకాశం కల్పించాలని రైతులను కోరారు. ఈ క్రమంలో ఎస్‌ఐ, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో మండల వ్యవసాయాధికారి కె.మురళీకృష్ణ వచ్చి రైతులతో మాట్లాడారు. తాను నిబంధనల ప్రకారమే పంట నమోదు చేశానని పక్క మండల అధికారులు ఎలా చేశారో తనకు తెలియదని చెప్పారు. అయితే ఎవరెవరి పంటలు నమోదు చేశారో జాబితా తమకు ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. ప్రస్తుతానికి పేర్లు ఆన్‌లైన్ చేశామని జాబితా రాగానే అందజేస్తానని ఏవో సమాధానమిచ్చారు. అనంతరం రైతులు, అధికారులతో పంచాయతీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉన్నతాధికారులతో చర్చించి పంట నష్టం నమోదు చేస్తానని పేర్కొంటూ రైతుల పేర్లు, పంట వివరాలు నమోదు చేసుకోవటంతో ఎట్టకేలకు ఆందోళన సర్ధుమనిగింది.
పంట నమోదు కోరుతూ రైతుల రాస్తారోకో


