ప్రభుత్వ భవనాల్లో మౌలిక వసతులు కల్పించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో వివిధ నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రభుత్వ భవనాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ డీకె బాలాజీ అధికారులకు సూచించారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శుక్రవారం సీఎస్‌ఆర్ నిధులతో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, విద్యాసంస్థల్లో మౌలిక వసతులను త్వరితగతిన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో రూ. 33.55 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో 99 పనులు మంజూరు చేయగా అందులో ఇప్పటి వరకు రూ. 9.86 కోట్లతో 60 పనులు పూర్తయ్యాయని మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి వెంటనే పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పనులు మంజూరు చేసినప్పటికీ ఇంకా మొదలు పెట్టకపోవటం సరైన పద్దతి కాదని, ఇలాగే ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సోమశేఖర్, ఈఈ నటరాజ్, పంచాయతీరాజ్ ఈఈ సుధాకర్‌గౌడ్, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ అధికారులతో
కలెక్టర్ బాలాజీ


