ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
కోడూరు: ఉరేసుకొని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని మాచవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చాణిక్య తెలిపిన వివరాల మేరకు..బలుసుపల్లి స్వరూపారాణి (39) ఇంట్లో ఎవరూ లేకుండా చూసి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. అయితే సాయంత్రానికి కుటుంబీకులు వచ్చి ఇంటి తలుపు కొడుతున్నా స్వరూపారాణి స్పందించకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలుకొట్టారు. ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్వరూపారాణిని వెంటనే అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ౖమచిలీపట్నం తరలిస్తుండగా మార్గమధ్యంలో స్వరూపారాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతురాలి కుమారుడు నాగఫణీంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
ఉయ్యూరు: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన ఉయ్యూరు పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రాజస్థాన్‌కు చెందిన ప్రజాపత్ జిత్తు (35) ఉయ్యూరులో స్థిరపడ్డాడు. టీస్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాయిమహల్ సెంటరు వద్ద మంగళవారం రాత్రి రోడ్డు దాటుతున్న క్రమంలో విజయవాడ నుంచి పామర్రు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జిత్తును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు. బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
యూటీఎఫ్ నాయకుల వినతి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.శ్రీనివాసరావు, ఎ. సుందరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీఈవోతో ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశమై విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సమస్యల వినతిపత్రాన్ని డీఈవోకి అందించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు, సుందరయ్య మాట్లాడుతూ విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ టీచర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు. గత సంవత్సరం ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల కోసం వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో సెలవు దినాల్లో పని చేసిన వారికి 10 రోజులు సీసీఎల్ లీప్ యాప్‌లో నమోదు చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్‌లో ఎస్‌ఎస్‌సీ స్పాట్ డ్యూటీ చేసిన ఉపాధ్యాయుల మూల్యాంకనం పారితోషకం చెల్లించాలని విన్నవించారు.


