బంగారు కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలి
గుడ్లవల్లేరు: మండలంలోని బంగారు కుటుంబాలకు జీవనోపాధులు కల్పించి పేదరికం నుంచి బయట పడేందుకు చేయూతను అందించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మండలంలోని డోకిపర్రు భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని కల్యాణ మండపంలో మంగళవారం ఉదయం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పి–4 కార్యక్రమంపై ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌ల సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. గ్రామానికి చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి మండలాన్ని దత్తత తీసుకున్నారు. కలెక్టర్ తొలుత మండలంలోని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, వారికి అప్పగించిన బంగారు కుటుంబాలలో ఎవరెలా ఉన్నారనే దానిపై సమీక్షించారు. ఆయా కుటుంబాలకు ఏం కావాలనే అంశాలపై అభిప్రాయాలను సచివాలయాల వారీగా అడిగి తెలుసుకున్నారు. బంగారు కుటుంబాలు కోరిన విధంగా వివిధ రకాల వ్యాపారాలు చేసుకోవటానికి వారికి చేయూతను అందించి జీవనోపాధులు కల్పించేందుకు మెయిల్ సంస్థ ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పిడి హరిహరనాథ్, గుడివాడ నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, గుడ్లవల్లేరు తహసీల్దారు లోకరాజు, ఎంపీడీవో ఇమ్రాన్, వెలుగు ఏపీఎం పాండురంగ ప్రసాద్, మెయిల్ ప్రాజెక్టు మేనేజర్ శివరామకృష్ణ, శిక్షణ అధిపతి జిలాని, ఏపీ మాస్ ట్రైనర్ బలరాం, యువ నిపుణులు మణికంఠరావు, వీఆర్వో వేణుగోపాలస్వామి, పలువురు సీఆర్‌పీలు పాల్గొన్నారు.
డోకిపర్రులో అధికారుల్ని ఆదేశించిన
కలెక్టర్ బాలాజీ
గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకున్న మెయిల్ సంస్థ


