సమన్వయంతో ఎదుర్కొందాం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
చిలకలపూడి(మచిలీపట్నం): అందరి సమన్వయంతో జిల్లాలో మోంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గనులు భూ గర్భవనరులు ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం మంత్రి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మోంథా తుపాను జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి, కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి తుపాను పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై శాఖల వారీగా అధికారులతో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి జిల్లా ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తోందన్నారు. ఈ తుపాను వల్ల సుమారు 16 వేల మందికి పైగా ప్రభావం చూపే అవకాశం ఉందని, మిగిలిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.
ప్రత్యేక బృందాలు..
జిల్లా ప్రత్యేక అధికారి కాట ఆమ్రపాలి మాట్లాడుతూ తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, మురుగు కాలువలు పొంగిపొర్లకుండా అడ్డంకులు తొలగించడం, విద్యుత్ స్తంభాలు కూలిపోతే పునరుద్ధరించడం, రహదారులు కొట్టుకుపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
165 పునరావాస కేంద్రాలు..
కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో లోతట్టు ప్రాంతంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వారికోసం 165 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతానికి 6,618 మంది ప్రజలను తరలించి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని, ఆలోపుగానే అవసరమైన నిత్యావసర సరుకులతోపాటు పిల్లలకి అవసరమైన పాలు, పండ్లు, ఔషధాలు, సరిపడా తాగునీరు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పాడవకుండా ఉండేందుకు స్విచ్లు ఆఫ్ చేసుకోవాలని సూచించారు. డీఆర్‌ఓ కె. చంద్రశేఖర రావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఏఎస్పీ సత్యనారాయణ, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్మన్ బండి రామ కృష్ణ, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని) తదితరులు పాల్గొన్నారు.


