రెస్క్యూ బృందాలు సంసిద్ధం
నాగాయలంక: మోంథా తుపాను తీవ్రత దృష్ట్యా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అన్నిచోట్లా రిస్క్యూ బృందాలు అవసరమైన మెటీరియల్‌తో సంసిద్ధంగా ఉన్నాయని, యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన నాగాయలంక మండలంలో పర్యటించి భద్రతా చర్యలు పర్యవేక్షించారు. ఆయన తొలుత మండలంలోని ఏటిమొగ వద్ద దీవుల ప్రజలకు సంబంధించిన పంటు మార్గాన్ని పరిశీలించారు. తుపాను పరిస్థితుల్లో దీవుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షం నిలకడగా ఉందని, దివిసీమ ప్రాంతంలో పునరావాస కేంద్రాలు, భవనాల పటిష్టత విషయంలో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తహసీల్దార్ సీహెచ్‌వీ ఆంజనేయ ప్రసాద్, అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ ప్రత్యేక డీఎస్పీ సీఎం గంగయ్య, మండల తుపాను స్పెషాలాఫీసర్, ఫిషరీస్ ఏడీ ఆర్.ప్రతిభ తదితరులు ఉన్నారు.
ప్రజలు బయటకు రావొద్దు..
అవనిగడ్డ: మోంథా తుపాను ప్రభావం దృష్ట్యా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని మంగళవారం ఎస్పీ పరిశీలించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 165 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేయడంతో పాటు, ప్రజల ఇళ్ల వద్ద దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని తగిన స్థాయిలో మోహరించి ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంచామని ఎస్పీ వివరించారు. ఆయనతో పాటుగా అవనిగడ్డ తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, అవనిగడ్డ సిఐ యువకుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పాల్గొన్నారు.


