భారీ గాలులతో నేలకూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
మచిలీపట్నంటౌన్: మోంథా తుపాను ప్రభావం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంపై పడింది. ఉదయం నుంచి కొద్దిపాటి గాలులతో ప్రారంభమై తుపాను కేంద్రం మచిలీపట్నంకు 50 కిలోమీటర్ల దగ్గరకు వచ్చే సరికి బలమైన గాలులు వీచాయి. చీకటి పడే సమయానికి బలమైన గాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో మచిలీపట్నం నగరంతో పాటు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ సరఫరా లేకపోవటంతో నియోజకవర్గం మొత్తం అంధకారం అలముకుంది. 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి. మంగినపూడిబీచ్ రోడ్‌లో మూడు చోట్ల, నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరా లేకపోవటంతో ప్రజలు సెల్‌ఫోన్ లైట్లు, కొవ్వొత్తుల వెలుగులోనే గడిపారు. నగరంలోని 33వ డివిజన్‌లో ఇంటిపై చెట్టు కూలింది. విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డాయి. ఆ డివిజన్ కార్పొరేటర్ మీర్ అస్గర్ అలీ సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు.


