అందని వందనం – తల్లుల దైన్యం
●38 మంది విద్యార్థుల
తల్లిదండ్రులు ఫిర్యాదు
●కొణకంచి జెడ్పీ హైస్కూల్‌లో
డీవైఈఓ విచారణ
కొణకంచి(పెనుగంచిప్రోలు): మండలంలోని కొణకంచి గ్రామంలో నలబోతు రామనాథం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు పడలేదు. హైస్కూల్‌లో 6 నుంచి 10 వ తరగతి వరకు మొత్తం 220 మంది విద్యార్థులు ఉండగా సుమారుగా 100 మందికి పైగా విద్యార్థుల వరకు డబ్బులు పడలేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే తమకు 38 మంది నుంచి మాత్రమే ఫిర్యాదులు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు ఎందుకు పడలేదో విద్యాశాఖ, గ్రామ సచివాలయంలో సంప్రదించినా సరైన సమాధానం రాలేదని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగటం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక్కొక్కరికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరికి మాత్రమే డబ్బులు పడ్డాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. కేవలం హైస్కూల్‌లో చదివే పిల్లలకు మాత్రమే డబ్బులు పడలేదని అంటున్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు...
తల్లికి వందనం డబ్బులు పడలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ప్రజా పరిష్కారాల వేదికలో కూడా అర్జీ అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీవైఈఓ శ్యాం సుందరరావు శుక్రవారం పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు. దీనిపై వివరణ కోరగా డీవైఈఓ మాట్లాడుతూ 38 మంది తల్లిదండ్రులు తల్లికి వందనం డబ్బులు పడలేదని జిల్లా కలెక్టర్, డీవైఈఓ, ఆర్జేడీలకు ఫిర్యాదులు చేశారని, దీనిపై పూర్తిగా విచారణ చేయగా ఆధార్ నంబర్లు తప్పుగా ఉన్నాయని గుర్తించామని, తప్పుల్ని సరిచేసి అందరు విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. కొందరికి ఇద్దరు పైన పిల్లలు ఉంటే ఒకరికి డబ్బులు పడ్డాయన్నారు.
హెచ్‌ఎం నాగరాజు మాట్లాడుతూ తాను జూన్ నెలలో పాఠశాలకు వచ్చానని, హెచ్‌ఎం లాగిన్‌లో తల్లి, పిల్లల ఆధార్‌కార్డు నంబర్లు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. కొన్ని బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డుకు అనుసంధానం కాకుండా ఉన్నాయన్నారు. తప్పులు అన్నీ ఐటీ సెల్ ద్వారా సరి చేయిస్తామన్నారు.
అందని వందనం – తల్లుల దైన్యం


