మద్యం షాపు తొలగించాలంటూ ఆందోళన
కృత్తివెన్ను: తమ గ్రామంలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని మండలంలోని సీతనపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం వారంతా షాపు వద్దకు చేరుకుని షాపు ముందు టెంట్ వేసి నిరసన తెలిపారు. ఇటీవల సీతనపల్లి గ్రామంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై ఎకై ్సజ్ శాఖాధికారులకు, స్థానిక అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినా కూడా వారు స్పందించలేదని గ్రామస్తులు ఆరోపించారు. తమ గ్రామంలో వెంటనే షాపు తొలగించాలని ఆందోళన చేయడంతో ఎకై ్సజ్ సీఐ రమణ విషయం తెలిసి అక్కడకు వచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి షాపును తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ షాపు నిర్వహణ కుదరదని వారు పట్టుపట్టడంతో షాపును తొలగిస్తున్నట్లు, వేరే ప్రాంతానికి తరలించనున్నట్లు సీఐ తెలిపారు. దీంతో గ్రామస్తులు నిరసన విరమించారు.


