రైతులకు అందుబాటులో ఉండాలి
కంకిపాడు: మండల స్థాయిలో అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ సస్యరక్షణ చర్యలు వివరించాలని కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి స్పష్టం చేశారు. ఈనెల 25వ తేదీన ‘వదలని వాన..రైతన్న హైరానా’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి శనివారం ఆమె స్పందించారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1.54 లక్షల హెక్టార్లలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు జరిగిందన్నారు. పైర్లు చిరుపొట్ట, గింజ గట్టిపడే దశలో ఉన్నాయన్నారు. గత ఐదురోజులుగా 107.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం 33 గ్రామాల్లో 379 మంది రైతులకు చెందిన 228.4 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించిందన్నారు. శాస్త్రవేత్తల బృందంతో కలిసి, వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి పంటల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తున్నామన్నారు. ముఖ్యంగా పొలాల్లో ముంపు నీటిని త్వరగా బయటకు తరలించాలన్నారు. ఎకరాకు 30 కిలోలు యూరియా, 15 కిలోలు పొటాష్ ఎరువులు పైపాటుగా వాడుకోవాలన్నారు. వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువగా రావటానికి ఆస్కారం ఉంటుందని, ఉధృతి ఎక్కువైతే మొక్కలు ఎండిపోయి చనిపోతాయన్నారు. నివారణకు ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి దుబ్బుకి తగిలేలా 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు పిచికారీ చేసుకోవాలన్నారు. అగ్గితెగులు ఉధృతికి వాతావరణం అనుకూలంగా ఉందని, తెగులు ఆశించినప్పుడు నూలుకండె ఆకారంలో గోధుమరంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ మచ్చలు పెద్దవి అయి మొక్కలు చనిపోతాయన్నారు. నివారణకు ట్రైసైక్లోజల్ 0.6 గ్రాములు లైదా కాసుగామైసిన్ 2 మిల్లీలీటర్లు, లేదా ప్యూజివన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. సుడిదోమ ఆశిస్తే ఇతోపెన్హాక్స 2 మిల్లీలీటర్లు లేదా 1.5 గ్రాములు ఎసిపేట్, లేదా 0.25 మిల్లీలీటర్లు ఇమిడాక్లోపిడ్ లేదా 0.20 గ్రాములు డయోమిథోకార్బ్ ఇతర వ్యవసాయ శాఖ సూచనల మేరకు మందులు వినియోగించి పైరుపై పిచికారీ చేసుకోవాలన్నారు.
వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ వరి కోతలు వాయిదా వేసుకోవాలని, అధిక వర్షాల దృష్ట్యా రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు ఇవ్వాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు.
కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి


