ఏబీపీలో కీలక సూచికల్లో పురోగతి
●పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం
పెంపుపై దృష్టి పెట్టాలి
● కేంద్ర ప్రభారి అధికారి
నేలపట్ల అశోక్‌బాబు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం (ఏబీపీ) అమలవుతున్న పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల్లో కీలక సూచికల్లో పురోగతి సాధించినట్లు కేంద్ర ప్రభారి అధికారి నేలపట్ల అశోక్‌బాబు అన్నారు. ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం మంచి చర్యలు చేపట్టిందని ప్రశంసించారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన ఆకాంక్షిత బ్లాకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల పెనుగంచిప్రోలు మండలంలో 25 సూచికల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో 18 సూచికల్లో నూరుశాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. మిగిలిన సూచికల్లో కూడా సంతృప్త స్థాయిని సాధించాలని సూచించారు. ఈ మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుంచి సంపద కేంద్రాలు మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. కొండపల్లి బొమ్మలను వివిధ రకాల ఆకృతుల్లో రూపొందించాలని సూచించారు. పాఠశాలల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి సారించాలని, కొండపల్లి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఆకాంక్షిత బ్లాకులలో మెరుగైన ఫలితాల సాధనకు స్మార్ట్ వ్యవసాయాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఏబీపీలో భాగంగా ఆరు కీలక సూచికల్లో నూరు శాతం సంతృప్త స్థాయి చేరుకోవడానికి 2024 జూలైలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రధానమంత్రి ‘సంపూర్ణత అభియాన్‘ కార్యక్రమం ప్రారంభించారని చెప్పారు. జిల్లాలోని రెండు ఏబీపీ మండలాల్లోనూ ఆరు సూచికల్లో నూరు శాతం లక్ష్యాలు సాధించి నీతి అయోగ్ నుంచి జిల్లా, మండల అధికారులు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు పొంది నట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన సూచికల్లోనూ సంతృప్త స్థాయి సాధిస్తామని తెలిపారు. ఏబీపీలో ఎ.కొండూరు మండలాన్ని కూడా చేర్చాలని కోరారు. అంతకుముందు కలెక్టరేట్ లోని ఇగ్నైట్ సెల్ లో డీఆర్డీఏ విభాగం ఏర్పాటుచేసిన స్టాల్‌ను కేంద్ర ప్రభారీ అధికారి అశోక్ బాబు కలెక్టర్ లక్ష్మీశతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కె. చైతన్య, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ నరసింహం, ముఖ్య ప్రణాళిక అధికారి వై.శ్రీలత, జెడ్పీ సీఈవో కేకే నాయుడు, కె.ఆర్.ఆర్.సి.స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పోసిబాబు, డీఎంహెచ్‌ఓ సుహాసిని, డీఆర్డీఏ పి.డి నాంచారయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


