తుపానును ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మోంథా తుపాను వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో జేసీ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టర్ తుపాను సన్నద్ధత సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తుపాను కారణంగా వేగంగా వీచే గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేప ట్టాలన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ప్రజలు నిత్యావసర సరుకులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున కొవ్వొత్తులు, బ్యాటరీ లైట్లు అందుబాటులో ఉంచుకోవాలని, ఫోన్లకు చార్జింగ్ పెట్టుకుని సిద్ధం చేసుకునేలా అప్రమత్తం చేయాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్యశిబిరాలు, పాముకాటు మందులు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే కంట్రోల్‌రూమ్ 08672– 252572 నంబరుతో ఏర్పాటు చేశామని, ఆర్డీఓ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా డివిజన్, మండలస్థాయిలో తుపాను, వరదలకు సంభవించిన ఎటువంటి సమాచారం వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. చిన్నపిల్లలు అంగన్‌వాడీ కేంద్రానికి రాకుండా వారికి ఇవ్వాల్సిన పోషకాహారాలను ఇంటి వద్దకే చేరవేయాలన్నారు. పశువుల పెంపకందారులు వాటిని ఇంటి వద్దనే ఉంచుకునేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తుపాను ప్రభావిత రోజుల్లో ప్రసవించనున్న గర్భవతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన యంత్ర పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జేసీ నవీన్ మాట్లాడుతూ.. ఆదివారం నాటికి అన్ని చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర వస్తువులన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం, హేలాషారోన్, ఏఎస్పీలు వి.వి.నాయుడు, సత్యనారాయణ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు రమణారావు, సోమశేఖర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామప్రసాద్ పాల్గొన్నారు.


