సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తాం
17వ రోజు కొనసాగిన పీహెచ్‌సీ వైద్యుల రిలే దీక్షలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘మాకు న్యాయపరంగా రావాల్సిన వాటిని ఇవ్వమని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతున్నాం.. అంతేకానీ కొత్తగా ఏమీ డిమాండ్ చేయడం లేదు’ అని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అంటున్నారు. తమ సమస్యలపై విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 17వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వైద్యులు దాదాపు 600 మంది వరకూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ ప్రధాన డిమాండ్లు అయిన ఇన్‌సర్వీసు కోటా పీజీ సీట్లు 20 శాతం 2030 వరకూ కల్పించడంతో పాటు, అన్ని స్పెషాలిటీ విభాగాల్లోనూ అడ్మిషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు భత్యం, 104 సర్వీసుల్లో పనిచేసినందుకు ప్రతి నెలా అదనపు అలవెన్సులు, ముఖ్యంగా టైమ్ బాండ్ పదోన్నతులు, టైమ్ బాండ్ స్కేల్స్ వర్తింపజేయాలని కోరుతున్నామన్నారు. వైద్యులుగా సర్వీసులో చేరిన వాళ్లు ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండానే పదవీ విరమణ చేస్తున్న వారు ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జ్ఞాణేష్, అధ్యక్షుడు రవీంధ్రనాయక్ ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


