కీలక ప్రగతి సూచికల్లో ఏ గ్రేడ్ సాధించాలి
సమీక్ష సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కీలక ప్రగతి సూచిక (కేపీఐ)ల్లో జిల్లా ర్యాంకు ముందంజలో ఉండాలంటే ప్రతి శాఖా ఉత్తమ పనితీరు కనబరచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కేపీఐలపై కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని శాఖలు బీ, సీ గ్రేడుల్లో ఉన్నాయని, దీని వల్ల జిల్లా ర్యాంకు ప్రభావితం అవుతోందని చెప్పారు. కేపీఐల లక్ష్యాలను పూర్తి చేసి ప్రతి శాఖ తప్పనిసరిగా ఏ గ్రేడ్ సాధించాలన్నారు. అన్ని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు (ఈహెచ్‌ఆర్) నిర్వహించాలన్నారు. ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రానికి వచ్చేలా చూడాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణ 100 శాతం జరగాలని స్పష్టంచేశారు. ఐటీఐ విద్యార్థులకు యాడ్ ఆన్ కోర్సుగా కృత్రిమ మేథ(ఏఐ) నేర్పించాలని ఆదేశించారు. జిల్లా విపత్తు తగ్గింపు వ్యూహాన్ని అన్నిచోట్ల అమలు చేయాలన్నారు. ఉన్నత విద్య, ఇంధన శాఖలు ఏ+ గ్రేడు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక దేశంలోనే వినూత్నమైనదన్నారు. ప్రతి నెలలో ఒకసారి తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశమై లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి వై.శ్రీలత, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, నియోజకవర్గ విజన్ కార్యాచరణ బృందాల సభ్యులు పాల్గొన్నారు.


