
జాషువా సాహిత్యం అజరామరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రచనలు చేసిన ఆధునిక కవుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందిన గుర్రం జాషువా సాహిత్యం అజరామరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ కొనియాడారు. నవయుగ కవి చక్రవర్తి జాషువా వర్ధంతి సందర్భంగా పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర లయోలా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో లయోల కాలేజీలో గురువారం జాషువా జీవిత చరిత్రపై కవి సమ్మేళనం, గుర్రం జాషువా సాహిత్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డ జాషువా ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన గొప్ప రచయిత అని అన్నారు. సాహితీవేత్త, న్యాయవాది డాక్టర్ వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ ఎనిమిది నాటకాలు, మూడు నవలలు, ఏడు ఖండ కావ్యాలు రచించిన జాషువా చిరస్మరణీయుడన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆమంచి అంజయ్య, డాక్టర్ ఎంఎస్‌కే షా, ఎం.అంజయ్య, కాకాని ప్రకాష్‌లకు గుర్రం జాషువా సాహిత్య పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. తొలుత గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అందె శ్రీనివాసులు, నిర్వాహకులు కె.మురళీమోహన్ రాజు, లయోల కాలేజీ ప్రిన్సిపాల్ ఫాదర్ డాక్టర్ ఎన్.మెల్కియోర్ ఎస్‌జె, లెక్చరర్ డాక్టర్ కోలా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఘనంగా జాషువా సాహిత్య పురస్కారాల ప్రదానం