
వానొస్తే నరకమే..
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): కూటమి పాలనలో విజయవాడలో రోడ్లు దారుణంగా కనిపిస్తున్నాయి. వానొస్తే రోడ్లు చెరువులుగా మారుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన ఏడాది దాటుతున్నా నగరంలోని మురుగునీటి కాలువల్లో పూడిక తీయకపోవడం, భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చకపోవడంతో కొద్ది పాటి వర్షానికే నగరంలోని రహదారులు నీట మునుగుతున్నాయి. మురుగునీటి పారుదల, భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థల నిర్వహణపై ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడంతో నగర వాసులు నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలకు అవస్థలు పడుతున్నారు. ఒక వైపున జోరున వాన, రోడ్లపై నిలిచిన వర్షం నీరు, మరోవైపు స్తంభిస్తున్న ట్రాఫిక్‌తో నగర వాసులు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
వర్షం.. డ్రెయినేజీ నీరు
పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, విశాలాంధ్ర రోడ్డు, ఏఎస్ రామారావు రోడ్డు, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ రోడ్డు, జమ్మిచెట్టు సెంటర్, మధుచౌక్, నైస్‌బార్ జంక్షన్, మైనేని జంక్షన్, రమేష్ ఆసుపత్రి జంక్షన్, చుట్టుగుంట సర్కిల్, సింగ్‌నగర్ ఫ్లైవోవర్ లోబ్రిడ్జి ఏరియాల్లో వర్షం నీటితో పాటు డ్రెయినేజీ నీరు, యూజీడీ మ్యాన్‌హోల్స్ నుంచి బయటకు వస్తున్న మురుగునీరు అన్నీ కలిసిపోయి రోడ్డుపై ప్రవహిస్తున్నాయి.
వాహనచోదకులు, పాదచారులు ఈ నీటిలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు సైడు కాలువ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. బందరురోడ్డుకు ప్రత్యామ్నాయంగా వాహనచోదకులు ఈ రోడ్డును ఉపయోగిస్తుంటారు. ఈ దారిలో కూడా వ్యాపార సముదాయాలు ఉండటంతో వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతటి ప్రాధాన్యమున్న రోడ్డులో వానొస్తే రెండు అడుగుల మేర వర్షం నీరు మురుగునీటితో కలిసి ప్రవహిస్తుంటాయి.
సుపరిపాలనలో పూడికలు తీసే ఆలోచన ఏదీ!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైందని సుపరిపాలనలో తొలి అడుగు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కానీ డ్రెయిన్లలో పూడిక తీయించాలనే ఆలోచన రాలేదు. ఇలా చేస్తే కాలువల్లో నీరు సజావుగా ప్రవహించి వర్షం నీరు రోడ్డుపై నిల్వ ఉండదనే ముందుచూపు కూడా కూటమి ప్రజాప్రతినిధులకు లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని రానున్న మరో మూడు రోజుల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనైనా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా నగర వాసులు కోరుతున్నారు.
జలమయమవుతున్న రహదారులు ఒక వైపు వర్షం...మరో వైపు ట్రాఫిక్ అవస్థలు పడుతున్న ప్రజలు విజయవాడలో పూడికతీయని కాలువలు
రోడ్లు మునకే
ఎంజీరోడ్డులో బెంజ్‌సర్కిల్, పంటకాలువ రోడ్డు, డీవీ మనార్ రోడ్డు, ఆటోనగర్ రోడ్డు, మహానాడు రోడ్డు, ఏలూరు రోడ్డు, క్రీస్తురాజపురం రోడ్డు, అజిత్‌సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ, పైపుల రోడ్డు, లోబ్రిడ్జి ప్రాంతం ఇవి నగరంలోని అత్యంత ప్రధానమైన రహదారులు. కొద్దిపాటి వర్షం కురిసినా ఈ రోడ్లపై వర్షం నీరు నిలిచి చెరువులుగా మారుతున్నాయి. దీనికితోడు మురుగుకాలువల్లో నీరు దీనిలో కలిసిపోవడంతో పాదచారులు, వాహనచోదకులు ఇక్కట్లు పడుతున్నారు.

వానొస్తే నరకమే..