
బంగరు భవితకు బాటలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ వసతులు వినియోగించుకుని విద్యార్థులు బంగరు భవితకు బాటలు వేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. గురువారం ఆయన విజయవాడ కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తున్నారా..? ఆహారం నాణ్యత ఎలా ఉంది? వంటి విషయాలను పరిశీలించారు. చిన్నారులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో 370 మంది విద్యార్థులుండగా అందరూ పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు తెలుసుకొన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యతోపాటు సరైన ప్రవర్తన కూడా ముఖ్యమని.. ఇవి రెండూ ఉన్నప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశముంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులను సరైన దారిలో నడిపించడానికి ఇటీవల ప్రభుత్వం మెగా పీటీఎం నిర్వహించిందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కెరీర్ కౌన్సెలింగ్ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ వెంట పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం.నరసింహాచార్యులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
పొట్టి శ్రీరాములు పాఠశాలలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తనిఖీ