
మాతృత్వ మధురిమలేవీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు అమ్మతనం కోసం ఆరాటపడతారు. పసిపాపలు ఇంట్లో సందడి చేయాలని పెద్దలు ముచ్చటపడుతుంటారు. మాతృత్వం అనేది ప్రతి మహిళకు వరం. అయితే నేటి ఆధునిక జీవన శైలి కారణంగా అనేక మంది మహిళలు సంతానలేమి సమస్యతో సతమతమవుతున్నారు. అందుకు వైద్యులు అనేక కారణాలున్నాయంటున్నారు. పిల్లలు పుట్టక పోవడానికి కొందరు మహిళల్లో, మరికొందరు పురుషుల్లో సమస్యలు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొన్నిచోట్ల భార్యాభర్తలు ఇద్దరిలోనూ సమస్య ఉంటున్నట్లు సంతాన సాఫల్య వైద్యులు అంటున్నారు. శుక్రవారం ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) డే సందర్భంగా ప్రత్యేక కథనం.
పెరిగిన వంధ్యత్వం
ఒకప్పుడు సంతానలేమి సమస్య 8 నుంచి 10 శాతం మంది జంటల్లో మాత్రమే ఉండేదని లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ సమస్యతో సతమతమవుతున్నవారు 15 నుంచి 20 శాతం మంది ఉన్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వారిలో అర్బన్ ప్రాంతాల్లో 20 శాతం వరకూ ఉంటుండగా, రూరల్ ప్రాంతంలో తక్కువగా 8 నుంచి 10 శాతం సంతానలేమితో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. సంతానలేమికి పురుషుల్లో 40 నుంచి 45 శాతం లోపాలు ఉంటుండగా, సీ్త్రలలో 50 నుంచి 55 శాతం వరకూ ఉంటున్నట్లు పేర్కొంటున్నారు.
ఏం చేయాలంటే..
ఆరోగ్యకరమైన ఆహారం , వ్యాయామం
సమతుల్య ఆహారం తీసుకోవడం, మితమైన వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానోత్పత్తిని పెంచుతుంది.
ధూమపానం, మద్యం మానేయడం
ధూమపానం, అధికంగా మద్యం తీసుకోవడం పురుషులు, సీ్త్రలలో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ అలవాట్లను మానేయాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
గర్భధారణకు ముందు కౌన్సెలింగ్
ఫోలిక్‌యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రారంభించడానికి, వైద్య పరిస్థితులను పరీక్షించడానికి గర్భధారణకు 3 నెలల ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ఏడాది ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించాలి.
ఒత్తిడి తగ్గించుకోవాలి
ఒత్తిడి హార్మోన్ స్థాయిలు, అండోత్సర్గమును ప్రభావితం చేస్తుంది. మైండ్‌ఫుల్‌నెస్, యోగా లేదా థెరపీ వంటి పద్ధతులు ఒత్తిడి తగ్గింపులో సహాయపడతాయి.
సంభోగం సమయం
క్రమం తప్పకుండా కలవడం, ముఖ్యంగా అండం విడుదల సమయంలో, గర్భధారణ అవకాశాలను పెంచుతుంది.
బరువు విషయంలో
తక్కువ బరువు, అధిక బరువు ఉన్న వ్యక్తులు సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటారు. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
పెరిగిన సంతానలేమి సమస్య మహిళలతో పాటు, పురుషుల్లోనూ లోపాలు జీవనశైలి కారణమంటున్న వైద్యులు సరైన నియమాలతో మహిళలకు అమ్మతనం నేడు ఐవీఎఫ్ డే

మాతృత్వ మధురిమలేవీ