
1 నుంచి స్వర్ణరథం
నున్న(విజయవాడరూరల్): ఎన్టీఆర్ జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుంచి స్వర్ణరథం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి పి.లావణ్యకుమారి తెలిపారు. నున్నలో గురువారం చెత్త సేకరణ పనులను ఆమె పరిశీలించారు. పోలారెడ్డి ఉష ఇంటి వద్ద గ్రామ పంచాయతీ చెత్తను సేకరించే పద్ధతిని పరిశీలించారు. అనంతరం డీపీఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక వాహనంలో పొడిచెత్తను సేకరించి వాటికి నిత్యావసరాలైన ఉల్లి పాయలు, వెల్లుల్లి, అల్లంలాంటివి ఇస్తారని తెలిపారు. గుంటూరు జిల్లాలో అమలుచేస్తున్నట్లు విజయవాడ రూరల్ మండలం నున్న, రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాల్లో స్వర్ణ రథం కార్యక్రమాన్ని పైలెట్ మండలంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్య క్రమంలో రూరల్ డెప్యూటీ ఎంపీడీఓ మన్నే వెంకట దుర్గాప్రసాద్, నున్న పంచాయతీ కార్యదర్శి సురేష్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు.
నిత్యావసరాల బ్లాక్‌మార్కెట్‌పై నిఘా పెట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యావసరాల బ్లాక్‌మార్కెట్‌పై నిఘా పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. జేసీ చాంబర్‌లో గురువారం జేసీ ఇలక్కియ అధ్యక్షతన జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయం, ఉద్యాన తదితర శాఖల అధికారులతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. జేసీ మాట్లాడుతూ ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని రైతుబజార్లు, హోల్ సేల్, రిటైల్ షాపులను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం నిత్యావస సరుకుల ధరలు స్థిరంగా ఉన్నాయని, పచ్చి శనగపప్పు ధర విషయంలో కొద్దిగా పెరిగినట్లు గమనించి దాల్ మిల్లర్లు, వర్తకులకు ధర తగ్గింపుపై చర్యలు తీసుకోవాలన్నారు. టమాట ధరలు పెరిగితే చిత్తూరు జిల్లా నుంచి కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు అందించాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డీఎస్వో ఎ.పాపారావు, జిల్లా అగ్రిట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి బి. రాజాబాబు, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, రైసు మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిర్భయంగా,
నిజాయతీతో విధులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, నిజాయతీతో వ్యవహరించాలని ప్రొబేషనరీ ఎస్‌ఐలకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సూచించారు. విశాఖపట్నం రేంజ్ గ్రేహౌండ్స్‌లో శిక్షణ పూర్తి చేసుకుని పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించిన 54 మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలు గురువారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం సాధన, పోలీసులు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పోలీసు శాఖలో అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్సైలను అభినందించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, ఏసీపీలు బి.ఉమా మహేశ్వరరెడ్డి, డి.పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి, సాయినగర్ షిర్డీ మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి, సాయినగర్ షిర్డీ మధ్య ప్రత్యేక వారంతపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి, సాయినగర్ షిర్డీ (07637) ప్రత్యేక రైలు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు సాయినగర్ షిర్డీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07638) ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు ప్రతి సోమవారం రాత్రి 7.35 గంటలకు సాయినగర్ షిర్డీలో బయలుదేరి, మరుసటి రోజు అర్ధరాత్రి 1.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్ తదితర స్టేషన్లలో ఆగుతుంది.

1 నుంచి స్వర్ణరథం