
ముగిసిన ఆషాఢ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో నిర్వహిస్తున్న ఆషాఢ మాసోత్సవాలు గురువారం ముగిశాయి. ఉదయం అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన అర్చకులకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సారెగా పట్టుచీర, పూజా సామగ్రితో పాటు రూ. 4.25 లక్షల విలువైన బంగారు హారాన్ని ఆలయ ఈవో శీనానాయక్‌కు అందజేశారు.
సారె సమర్పించిన భక్త బృందాలు
ఆషాఢ మాసం చివరి రోజు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురు భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో సేవలు అందించిన భక్త బృందానికి చెందిన 500 మంది సారె సమర్పించారు. మరో వైపున వర్షాలు పడుతుండటంతో గురువారం కూడా ఘాట్‌రోడ్డును ఆలయ అధికారులు మూసివేశారు. భక్తులను మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించు కున్నారు.
ఆర్జిత సేవలకు డిమాండ్
ఆషాఢ అమావాస్య నేపథ్యంలో దుర్గగుడిలో ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున 3.30 గంటలకు అమ్మవారి సుప్రభాత సేవకు 50కి పైగా టికెట్లను విక్రయించారు. అమ్మవారి ప్రధాన ఆలయంలో జరిగే ఖడ్గమాలార్చనకు డిమాండ్ అధికం కావడంతో రెండు షిఫ్టుల్లో పూజ చేశారు. రెండు షిప్టుల్లో మొత్తం 30 టికెట్లను విక్రయించగా, అరవై మందికి పైగా పూజలో పాల్గొన్నారు. ఇక చండీహోమానికి ప్రత్యక్షంగా పూజకు 180కి పైగా టికెట్లను విక్రయించగా పరోక్ష సేవగా మరో 86 టికెట్లను విక్రయించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారి ప్రధాన ఆలయంలో చేసిన స్వర్ణ పుష్పార్చనకు డిమాండ్ కనిపించింది. సాయంత్రం పంచహారతుల సేవలోనూ ఉభయ దాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
దుర్గమ్మకు ఆలయ అర్చకుల సారె బంగారు హారాన్ని సమర్పించిన అర్చక బృందం