
గ్రంథాలయాలు ఉన్నంతకాలం అయ్యంకి సజీవులే
పటమట(విజయవాడతూర్పు): ప్రజలకు విజ్ఞానాన్ని అందించడానికి పరిశ్రమించిన అయ్యంకి వెంకట రమణయ్య గ్రంథాలయాలు ఉన్నంతకాలం సజీవంగా ఉంటారని ఏపీ పౌర గ్రంథాలయాల సంచాలకుడు ఎ. కృష్ణమోహన్ అన్నారు. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య 135వ జయంతి సందర్భంగా ఏపీ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యాన గురువారం సర్వోత్తమ గ్రంథాలయంలోసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రంథాలయాల స్థాపనకు ప్రజలను ప్రోత్సహించడానికి భిన్న మార్గాలను ఎంచుకొని పట్టుదలతో అన్నింటిలో విజయాలను సాధించిన అయ్యంకిని ప్రతి గ్రంథాలయ కార్యకర్త, గ్రంథపాలకుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ వందేళ్ల క్రితమే ఎంతో ముందు చూపుతో గ్రంథాలయ, విజ్ఞాన రంగాల ప్రగతికి బాటలు వేసిన అయ్యంకిని సమాజ దార్శనికుడు అన్నారు. ఏపీ గ్రంథాలయ సంఘ ఉపాధ్యక్షుడు కేశవరావు మాట్లాడుతూ మహనీయుల చరిత్రలు జాతిని ప్రభావితం చేస్తాయని చెప్పారు. గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద మాట్లాడుతూ జాతీయోద్యమ కాలంలో గ్రంథాలయాలతో ప్రజలు స్ఫూర్తిపొందారన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో 11 కాలేజీల విద్యార్థులు పోటీ పడగా, ప్రథమ స్థానాన్ని దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, ద్వితీయ స్థానాన్ని మారిస్టెల్లా కళాశాల, తృతీయ స్థానాన్ని లయోలా కళాశాల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. పలువురు గ్రంథ పాలకులు, విద్యార్థులు, వివిధ ప్రైవేటు గ్రంథాలయాల నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.