
లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర విజన్ .. 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా, నియోజకవర్గాల వారీగా దార్శనిక ప్రణాళికల రూపకల్పన జరిగిందని, శాఖల వారీగా కీలక పురోగతి సూచిక (కేపీఐ)లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. గురువారం వ్యవసాయం, మత్స్య, పట్టు పరిశ్రమ, సాంఘిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖల అధికారులతో స్వర్ణాంధ్ర విజన్ – కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ), స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులకు పెట్టుబడి ఖర్చులకు ఉపయోగపడేలా సీసీఆర్‌సీ కార్డుల ద్వారా సత్వరం బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్‌తో యువతకు జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయని.. వీటి ఆధారంగా మెరుగైన కెరీర్‌ను అందుకునేందుకు వీలుంటుందన్నారు. స్వయం ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించాలని.. ఇందుకు అందుబాటులో ఉన్న పీఎంఈజీపీ వంటి పథకాలను ఉపయోగించుకోవాలన్నారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ