
రుద్రవరంలో భారీ చోరీ
జి. కొండూరు: ఒక వైపు కుటుంబ పెద్ద మృతితో తీరని శోకంలో ఉన్న ఆ కుటుంబానికి ఇంట్లో జరిగిన భారీ చోరీ మరింత విషాదాన్ని నింపింది. ముగ్గురు కుమార్తెల కోసం దాచుకున్న బంగారు ఆభరణాలు చోరీకి గురవడంతో బాధిత మహిళ లబోదిబోమంటున్నారు. గుండెపోటుతో మృతి చెందిన పాస్టర్ అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులందరూ నిమగ్నమై ఉండగా ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండల పరిధి రుద్రవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సేకరించిన వివరాలు ఇవి..
కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండల పరిధి సీతనపల్లి గ్రామానికి చెందిన పాస్టర్ రెవరెండ్ నల్లగంగుల శుభకరరాజు తన భార్య విమల, నలుగురు కుమార్తెలతో కలిసి రెడ్డిగూడెం మండల పరిధి రుద్రవరం గ్రామంలోని సీఎస్‌ఐ చర్చిలో పని చేసేందుకు రెండు సంవత్సరాల క్రితం వచ్చారు. ఈ కుటుంబం రుద్రవరం గ్రామంలోనే చర్చి వెనకాల ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఒక కుమార్తెకు మాత్రమే వివాహం అయ్యింది. అయితే ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం 12గంటల సమయంలో పాస్టర్ శుభకరరాజుకి గుండెపోటు వచ్చి ఇంట్లోనే మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులు.. తమ బంగారు ఆభరణాలు, రూ.25వేలు నగదును ఇనుప బీరువాలో ఉంచి ఇంటికి తాళ వేసి పాస్టర్ అంత్యక్రియలు జరిపేందుకు మృతదేహాన్ని తీసుకొని స్వగ్రామం సీతనపల్లి గ్రామానికి అదే రోజు సాయంత్రం వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత 12వ తేదీన తిరిగి రుద్రవరం గ్రామానికి వచ్చారు. ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో పాస్టర్ భార్య విమలకు అనుమానం వచ్చి ఇనుప బీరువా తెరిచేందుకు ప్రయత్నించారు. ఇనుప బీరువా కూడా తాళం పెట్టకుండానే తెరుచుకోవడం, బీరువాలో బంగారు ఆభరణాలు కనిపించక పోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు.
ఆధారాల్లేవు..
వెంటనే రెడ్డిగూడెం పోలీసులకి సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీకి పాల్పడిన దుండగులు వేలిముద్రలు కూడా పడకుండా జాగ్రత్త పడడంతో క్లూస్ టీంకు సైతం ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. ఈ చోరీలో రెండు బంగారు గాజులు, ఒక నల్లపూసల గొలుసు, నాలుగు జతల చెవి దిద్దులు, ఒక జత జోకాలు, మూడు పెద్ద ఉంగరాలు, రెండు చిన్న ఉంగరాలు, ఒక జత చెవుల జోడు, చైన్‌లు రెండు, రూ.25వేలు కరెన్సీ నోట్లు కలిపి మొత్తంగా రూ.13లక్షల విలువ చేసే ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ చోరీ ఘటనపై పాస్టర్ భార్య విమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తు చేస్తున్నాం..
ఈ ఘటనపై రెడ్డిగూడెం ఎస్‌ఐ బండి మోహన్‌రావు వివరణ కోరగా గ్రామంలో అనుమానితులను విచారించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
రూ.13 లక్షల విలువగల బంగారు ఆభరణాలు అపహరణ కుటుంబ పెద్ద మరణంతో సొంత గ్రామానికి వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంట్లో బీరువాలోని ఆభరణాలు మాయం ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదన్న పోలీసులు