
ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాల్వలు, చెరువుల వెంట ఆక్రమణలను గుర్తించి, తొలగించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఎన్టీఆర్ జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో జిల్లా వాచ్‌డాగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జీవో నంబర్ 386లో నిర్ధేశించిన విధంగా నీటి వనరులు, చెరువుల బెడ్‌లను ఆక్రమణల నుంచి రక్షించేందుకు జిల్లా స్థాయి వాచ్‌డాగ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ జిల్లాలోని నీటి వనరులు, ట్యాంక్ బెడ్‌లను గుర్తించి వాటి స్థితిని ప్రతి నెలా సమీక్షించి, ప్రభుత్వానికి రౖతై మాసిక నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రతినెలా నిర్ణీత సమయంలో కమిటీ సమావేశమై ఆక్రమణలను గుర్తించడంతో పాటు తొలగించేందుకు కార్యాచరణ చేపట్టాల్సిందిగా తాజా సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈ ఎం.ఆర్ మొహిద్దీన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాస్, విజయవాడ నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ సంధ్య రత్నకుమార్ పాల్గొన్నారు.
అందుబాటులోకి ‘పోస్టల్ అడ్వాన్స్‌డ్’ సేవలు
ఇంటి నుంచే బుకింగ్స్, డెలివరీలకు అవకాశం
చల్లపల్లి: అడ్వాన్స్‌డ్ పోస్టల్ 2.0 ద్వారా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించనున్నారు. భారత ప్రభుత్వ తపాలా శాఖ మచిలీపట్నం డివిజన్ పరిధిలో ఈనెల 7వ తేదీన 78, 21వ తేదీన 115 పోస్టాఫీసుల్లో కొత్త టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేశారు. డివిజన్ పరిధిలో ఉన్న అన్ని 193 పోస్టాఫీసుల్లో సేవలు వేగవంతం కానున్నాయి. ఈ సందర్భంగా తపాలా శాఖ మచిలీపట్నం డివిజన్ సూపరింటెండెంట్ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కొత్త సాంకేతికత ద్వారా ప్రజలు ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ లెటర్లను, స్పీడ్ పోస్టులను బుక్ చేసుకునే వీలు కలుగుతుందన్నారు. సెల్‌ఫోన్‌లో ఎస్‌ఎంఎస్ ద్వారా గానీ, ఈ–మెయిల్ ద్వారా గానీ బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వెసులుబాటును ఈ టెక్నాలజీతో కల్పించారని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటీపీ లేదా ఆధార్ ఆధారిత డెలివరీలను ఎంచుకునే వీలుందని చెప్పారు. డోర్ డెలివరీలాగా ఇక నుంచి డోర్ రిసీవింగ్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఆధార్ కార్డులకు సంబంధించిన అన్ని సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
బుడమేరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం
ఈలప్రోలు(ఇబ్రహీంపట్నం): బుడమేరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈలప్రోలు వద్ద పాతవంతెన కింద ముళ్ల కంచెకు పట్టుకుని ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పట్టిసీమ నుంచి నీరు విడుదల కావడంతో మృతుడు ఏప్రాంతానికి చెందిన వారై ఉంటారనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.