
కవులు, రచయితల శక్తి అసామాన్యమైనది
ప్రణామం కవి సమ్మేళనంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ కల్చరల్/గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): కవులు, రచయితలకు ఉన్న శక్తి అసామాన్యమైనదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. వారి కలం నుంచి జాలువారిన అక్షర శక్తి ముందు తూటా శక్తి కూడా నిలువలేదని చెప్పారు. విజయవా డ బందరురోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ఆవరణలో ఆదివారం మల్లెతీగ సాహిత్యసేవాసంస్థ ఆధ్వర్యంలో ‘ప్రణామం’ కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ అర్థవంతమైన రచనలు సమాజ దిశను దశను మార్చుతాయని, సమాజంలోఎన్నో విప్లవాత్మక మార్పులకు కలం, గళమే కారణమన్నారు. కార్యక్రమాన్ని చొప్పా రాఘవేంద్ర శేఖర్ పర్యవేక్షించగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 80 మంది కవులు తెలుగు భాష, ప్రపంచశాంతి, పర్యావరణం, దేశభక్తి, సామాజిక చైతన్యం అంశాలపై కవితాగానం చేశారు. అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా కవులు ప్రమాణం చేశారు. సుప్రసిద్ధ కవులు శ్రీరామకవచం సాగర్, డాక్టర్ ఎం.ప్రభాకర్, వ్యాఖ్యాన శిరోమణి వేముల హజరత్తయ్య గుప్తా, సీనియర్ జర్నలిస్ట్ ఘంటా విజయ్‌కుమార్, మల్లెతీగ కలిమిశ్రీ, బుక్ ఆఫ్ భారత్ రికార్డ్స్ డాక్టర్ ఎస్. దుర్గాకుమార్ తదితరులు పాల్గొన్నారు.