
విద్యకు పేదరికం అడ్డు కాకూడదు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విద్యకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) ఏటా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్‌లో ఉన్న ‘అమ్మ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం అమ్మ హాలులో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథి లక్ష్మీశ విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఉపకార వేతనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వం పీ–4 విధానాన్ని తీసుకొచ్చిందని, దాదాపుగా 300 బంగారు కుటుంబాలకు ఆంధ్రామోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) మార్గదర్శకులుగా వ్యవహరించి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకురావడం అభినందనీయమన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా కూడా అమ్మ ఆధ్వర్యంలో ప్రచారం చేయాలన్నారు.
వృద్ధులకు ఆశ్రయం
అమ్మ అధ్యక్షుడు గారపాటి సతీష్‌బాబు మాట్లాడుతూ ఈ ఏడాది 408 మంది విద్యార్థులకు రూ.16 లక్షలను ఉపకార వేతనాలుగా అందచేస్తున్నామని చెప్పారు. కానూరులో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని నిర్మించి వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నామని చెప్పారు. సంఘం సభ్యులు జీవీ సుబ్బారావు, దుర్గాప్రసాద్, చంద్రశేఖర్‌తో, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.