
శిక్షణ, బోధనేతర విధుల్లో ఉపాధ్యాయులు బిజీ
మచిలీపట్నం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థుల చదువులు గాడి తప్పాయి. పాఠశాలలు ప్రారంభమై 36 రోజులు గడిచినా, ఉపాధ్యాయులు తగినంత సమయాన్ని విద్యార్థులకు కేటాయించకపో వడం విద్యా ప్రమాణా లను దెబ్బతీస్తోంది. ఉద్యోగోన్నతి పొందిన, బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆయా స్థానాల్లో ఇప్పటికీ బాధ్యతలు చేపట్టలేదు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కారణంగా మిగిలిపోయిన ఉపాధ్యాయులను క్లస్టర్ టీచర్లుగా నియమించారు. మరోవైపు శిక్షణలు, ఇతర కార్యక్రమాలకే ఉపాధ్యాయులు పరిమితమై, పాఠాలు బోధించడంలేదు. వీటన్నింటి ఫలితంగా బడి చదువులను మరింత దిగజార్చాయి.
బోధనా సమయం వృథా
యోగా డే, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వంటి కార్యక్రమాల పేరుతో బోధనా సమయాన్ని ప్రభుత్వం వృథా చేసింది. శిక్షణల పేరుతో తరచూ ఉపాధ్యాయులను పాఠశాల విధుల నుంచి దూరం చేస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఫార్మెటివ్ అసెస్మెంట్ –1 పరీక్షలు జరగనున్నాయి. అయితే ఉపాధ్యాయులు అందుబాటులో లేక, పాఠాలు బోధించక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మిగులు టీచర్లకు క్లస్టర్ విధులు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2,710 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ పేరుతో వాటిని 2,687 పాఠశాలలకు కుదించింది. దీంతో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు మిగిలిపోయారు. మిగులు ఉపాధ్యాయులను అధికారులు క్లస్టర్ టీచర్లుగా నియమించారు. మండలాల్లో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12,612 మంది ఉపాధ్యాయుల్లో 693 మంది క్లస్టర్ టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారి సేవలను ఒకే పాఠశాలలో నిరంతరం ఉపయోగించకుండా, అవసరమున్న పాఠశాలలకు రొటేషన్ పద్ధతిలో పంపిస్తున్నారు. పిల్లల చదువులు పటిష్టంగా కొనసాగాలంటే ఉపాధ్యాయులు పూర్తి సమయానికి పాఠశాలల్లో ఉండేలా చూడటం అవసరం. పోస్టింగ్‌ల్లో స్పష్టత, శిక్షణల సమన్వయం, పరిపాలనా వ్యవస్థలో సమర్థత లేకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు సవాలుగా మారుతోంది. ఈ సంక్షోభ పరిస్థితులను అధిగమించేందుకు విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
డీఎస్సీ తరువాతా కష్టమే
డీఎస్సీ ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేసిన తరువాతే ఉద్యోగోన్నతులు పొందిన ఉపాధ్యాయులు, బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి 1,048 ఖాళీలు ఉండగా 1,213 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ వ్యత్యాసం విద్యాశాఖ లోపభూయిష్ట నిర్వహణను బయటపెడుతోంది. ఒకవేళ డీఎస్సీతో నోటిఫై చేసిన టీచర్ పోస్టులు భర్తీ చేస్తే, ఒకపక్క డీఎస్సీ మిగులు, మరోపక్క క్లస్టర్ టీచర్ల సర్దుబాటులో అనిశ్చితి ఏర్పడనుంది. నియామకాల్లో స్పష్టత లేక విద్యా వ్యవస్థలో గందరగోళంతో విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగా సాగుతాయి.
తల్లిదండ్రుల్లో సడలిన నమ్మకం
విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 12 రకాల పాఠశాలల విధానం తీవ్ర అవస్థలకు దారితీసింది. పాఠశాలల విలీనం, మూసివేత, ఉపాధ్యాయుల సర్దుబాటు, రేషనలైజేషన్ చర్యలతో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం సడలింది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించడంలో అనిశ్చితి ఏర్పడింది. కృష్ణాజిల్లాలో 198 మోడల్ ప్రైమరీ పాఠశాలు ఉండగా, 108 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30 నుంచి 40 వరకు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్లలో తక్షణమే విద్యార్థుల చేరికలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించిన విషయం విదితమే.
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులు ఇలా..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 12,612 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో 391 మంది ప్రధానోపాధ్యాయులు (గ్రేడ్–ఐఐ), 771 స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) తెలుగు, 21 ఎస్‌ఏ ఉర్దూ, 15 ఎస్‌ఏ సంస్కృతం, 714 ఎస్‌ఏ హెచ్‌ఎం, 858 ఎస్‌ఏ ఇంగ్లిష్, 898 ఎస్‌ఏ మ్యాథ్స్/తెలుగు, 06 ఎస్‌ఏ మ్యాథ్స్/ఉర్దూ, 646 ఎస్‌ఏ పీస్/తెలుగు, 06 ఎస్‌ఏ పీఎస్/ఉర్దూ, 697 ఎస్‌ఏ బీఎస్/ తెలుగు, 06 ఎస్‌ఏ బీఎస్/ఉర్దూ, 714 ఎస్‌ఏ ఎస్‌ఎస్/తెలుగు, 06 ఎస్‌ఏ ఎస్‌ఎస్/ఉర్దూ, 472 ఎస్‌ఏ పీడీ, 67 ఎస్‌ఏ ఎస్పీఏల్ ఈడీఎన్ తెలుగు, 563 పీఎస్ హెచ్‌ఎం తెలుగు, 23 పీఎస్ హెచ్‌ఎం ఉర్దూ, 4743 ఎస్జీటీ తెలుగు, 237 ఎస్జీటీ ఉర్దూ, 23 ఆర్ట్, డ్రాయింగ్, 14 క్రాఫ్ట్, 20 ఒకేషనల్, 08 మ్యూజిక్, 78 క్లస్టర్ ఎస్‌ఏ తెలుగు, 49 క్లస్టర్ ఎస్‌ఏ ఇంగ్లిష్, 01 క్లస్టర్ ఎస్‌ఏ సంస్కృతం, 03 క్లస్టర్ ఎస్‌ఏ ఉర్దూ, 08 క్లస్టర్ ఎస్‌ఏ బయో, 24 క్లస్టర్ ఎస్‌ఏ మ్యాథ్స్, 17 క్లస్టర్ ఎస్‌ఏ పీఎస్, 36 క్లస్టర్ ఎస్‌ఏ ఎస్‌ఎస్, 08 క్లస్టర్ ఎస్‌ఏ పీడీ, 428 క్లస్టర్ ఎస్జీటీ తెలుగు, 41 క్లస్టర్ ఎస్జీటీ ఉర్దూ ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యాప్రమాణాల పెంపే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యం. బదిలీ అయిన ఉపాధ్యాయుల బాధ్యతల స్వీకరణ, క్లస్టర్ టీచర్ల సమర్థ వినియోగం, శిక్షణల సమన్వయం వంటి అంశాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ఫార్మేటివ్–1 పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాం. క్లస్టర్ టీచర్ల సేవలను అవసరమైన పాఠశాలల్లో సమర్థవంతంగా వినియో గించే విధంగా మార్గదర్శకాలు జారీ చేశాం. ఖాళీ పోస్టుల భర్తీ అనంతరం విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.
– పి.ఇ.జె.రామారావు,
డీఈఓ, కష్ణాజిల్లా
విధుల్లో చేరని ఉద్యోగోన్నతి పొందిన, బదిలీ అయిన టీచర్లు
టీచర్ల నియామకాల్లో స్పష్టత లేక విద్యా వ్యవస్థలో గందరగోళం
తక్షణ చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తుపై దుష్ప్రభావం

శిక్షణ, బోధనేతర విధుల్లో ఉపాధ్యాయులు బిజీ

శిక్షణ, బోధనేతర విధుల్లో ఉపాధ్యాయులు బిజీ