
మినుముకు దక్కని మద్దతు
కంకిపాడు: పునాదిపాడు గ్రామానికి చెందిన రైతు సాయిబాబు ఐదెకరాల్లో మినుము సాగు చేశాడు. ఎకరాకు ఎని మిది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గతేడాది క్వింటా మినుము ప్రభుత్వ మద్దతు ధర రూ.7,400. మార్కెట్‌లో క్వింటా ధర రూ.9100కు పైగా పలికింది. గతేడాది మాదిరిగానే ఈ సారీ మంచి ధర లభిస్తుందని ఆశించాడు. రోజురోజుకూ ధర తగ్గడంతో ఆందోళన చెందుతున్నాడు. పంటను ఇంట్లో నిల్వ చేసుకోలేక, వచ్చిన ధరకు తెగనమ్మలేక సతమతమవుతున్నాడు. ఇది ఈ ఒక్క రైతు ఇబ్బందే కాదు. జిల్లా వ్యాప్తంగా గత రబీలో మినుము సాగు చేసిన రైతులు అందరి పరిస్థితి. ధర ఆశాజనకంగా ఉంటుందని ఆశించి పంట నిల్వ చేసిన రైతులు నేడు నానాటికీ పడిపోతున్న మినుము ధరలను చూసి నిరాశ చెందుతున్నారు. దళారులు మార్కెట్‌ను నియంత్రించి అడ్డగోలుగా ధర నిర్ణయం చేస్తుండటంతో రైతులులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల వద్ద ఉన్న పంటను కొనుగోలుచేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
దిగుబడులు భళా
జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో గత రబీ సీజన్‌లో 2,84,237 ఎకరాల్లో మినుము సాగయింది. పెసర మరో మూడు వేల హెక్టార్లలో సాగయింది. అక్కడక్కడా పల్లాకు తెగులు, బంగారు తీగ, మచ్చల పురుగు ఆశించినా మంచి దిగుబడులు లభించాయి. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు రైతులకు సాగు ఖర్చులవగా, ఏడు నుంచి తొమ్మిది క్వింటాళ్ల వరకూ దిగుబడులు వచ్చాయి.
పతనమవుతున్న ధర
గత రబీ సీజన్‌లో జిల్లాలో 12 ప్రాంతాల్లో పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల ద్వారా 519 మంది రైతుల నుంచి 1,128.45 టన్నులు పెసరను కొనుగోలు చేశారు. మినుము మద్దతు ధర రూ.7,400 కాగా మార్కెట్‌లోనూ రూ.7,400 నుంచి రూ.7,600 వరకు ధర పలకడంతో మినుముల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలనే డిమాండ్ రైతుల నుంచి రాలేదు. గతేడాది ఇదే సీజన్‌లో రూ.9,100కు పైగా మార్కెట్‌లో ధర లభించింది. అదే తరహాలో ధర పెరుగుతుందనే ఆశాభావంతో చాలా మంది రైతులు ఇళ్ల వద్దే మినుమును నిల్వ చేసుకున్నారు. ఊహించని విధంగా ధర నేల చూపులు చూస్తోంది. క్వింటా ధర రూ.6500 నుంచి రూ.6,600 చొప్పునే పలుకుతోంది.
రైతుల గోడు పట్టని కూటమి సర్కారు
రోజు రోజుకూ మినుము ధర పతనమవుతున్నా కూటమి సర్కారు స్పందించటం లేదు. కనీస మద్దతు ధర కూడా దక్కక, పంటను విక్రయించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులపై కనికరం చూపడం లేదు. మార్కెట్‌లో దళారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయం చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం కళ్లుతెరిచి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల స్థాయిలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తే తప్ప మద్దతు ధర దక్కదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు.
క్వింటా మినుము మద్దతు ధర రూ.7,400 రూ.6,600 మాత్రమే ఇస్తున్న వ్యాపారులు రైతుల వద్ద పేరుకుపోయిన నిల్వలు