
ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి
చంద్రశేఖరరావు
చిలకలపూడి(మచిలీపట్నం): ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను సమన్వయంతో, పకడ్బందీగా నిర్వహించాలని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. ఆదివారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు పరీక్షలు జరుగు తాయని తెలిపారు. పరీక్షలకు 1,813 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పెనమలూరు మండలంలోని కానూరులో ఉన్న ఆయాన్ డిజిటల్ జోన్, ప్రసాద్ వీ పొట్లూరి సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గంగూరులోని ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మచిలీపట్నంలోని డీఎంఅండ్ హెచ్‌వీహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయని వివరించారు. అభ్య ర్థులే కాకుండా ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష హాల్‌లోకి సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు తీసుకురాకూడదని స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఎటువంటి జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు తెరవకుండా మూసి ఉంచాలని, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు మౌలిక వసతులు కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు ఆరోగ్యరాణి, విజయలక్ష్మి, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ కిష్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.