
ప్లాస్టిక్ వినియోగంతో మానవాళికి ముప్పు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
గుడివాడరూరల్: విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగంతో మానవాళికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ హెచ్చరించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర–2047 సంకల్పంలో భాగంగా శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. భావితరాల భవిష్యత్ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిద్దామన్నారు. ఆహార అవసరాలకు ఆకులతో తయారు చేసిన ప్లేట్లు, సహజసి ద్ధంగా తయారైన వస్తువులనే వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరు గుర్తించి వ్యక్తిగత అవసరాలకు జూట్ సంచులు, స్టీలు, పింగాణీ పాత్రలు, పర్యావరణహితమైన వస్తువులను వినియోగించాలని సూచించారు. తొలుత ప్లాస్టిక్ నియంత్రణపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, మునిసిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.