
పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్ సీపీ నేతల నిర్బంధం
కోనేరుసెంటర్: ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మచిలీపట్నంలో వైఎస్సార్ సీపీకి చెందిన కొంతమంది నాయకులను ఇనగుదురుపేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్లితే...వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్ (సుబ్బన్న), ట్రెజరర్ థామస్‌నోబుల్, ఉపాఽఽధ్యక్షులు గూడవల్లి నాగరాజు, తిరుమలశెట్టి ప్రసాద్, కొలుసు హరిబాబు, కోఆప్షన్ సభ్యుడు తుమ్మలపల్లి జగన్నాధరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆపార్టీ కార్యకర్తలు పోలీసుస్టేషన్ వద్దకు చేరి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆందోళన చేశారు. తమ నాయకులను కలవాలని వారు కోరగా, అందుకు పోలీసులు అనుమతించలేదు.
విషయం తెలుసుకున్న మరికొందరు కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరడంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. విషయం తెలుసుకుని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేర్ని కిట్టు స్టేషన్ వద్దకు చేరుకుని తమ నాయకులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ సీఐ పరమేశ్వరరావును నిలదీశారు. అరెస్టయిన వారిని కలిసి మాట్లాడేందుకు పేర్ని కిట్టును అనుమతించడంతో ఆయన వెళ్లి వారితో మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలో వైఎస్సార్ సీపీ మహిళలు గురువారం చీపుర్లతో నిరసన తెలిపిన ఘటనపై టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆందోళనకు దిగిన నాయకులు, కార్యకర్తలు ఇనగుదురుపేట ఠాణా వద్ద ఉద్రిక్తత