
నైపుణ్యం పెంపుతోనే ఆర్థిక పురోగతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆర్థిక వ్యవ స్థలో ప్రజల్ని భాగస్వాములను చేయడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్యసాధనకు నీతిఆయోగ్ కృషి చేస్తోందని నీతిఆయోగ్ గౌరవ సభ్యుడు డాక్టర్ అరవింద్‌విర్మానీ పేర్కొన్నారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో అధ్యక్షులు గడ్డం బాలవెంకటరవికుమార్ అధ్యక్షతన చాంబర్ సభ్యులతో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అరవింద్ విర్మానీ మాట్లాడుతూ దేశంలో విద్యావంతుల్లో చాలామందికి ఆయారంగాలలో నైపుణ్యం, ప్రావీణ్యం లేకపోవడం స్పష్టంగా కన్పిస్తోందన్నారు. విద్యతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించుకుని, మౌలికసదుపాయాలను అభివృద్ధి చేసుకుంటేనే ఆయారంగాలో, దేశంలోనూ పురోగతి ఉంటుందన్నారు. అందరూ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఏదోగొప్పగా చెబుతున్నారని, దానికంటే ముందుగా మౌలిక సౌకర్యాలను కల్పించుకోవడం, నైపుణ్యం పెంపొందించుకోవడం అవసరమన్నారు. సభ్యులు మాట్లాడుతూ జీఎస్టీకి ముందు, జీఎస్టీ తర్వాత తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా, ఆయా అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని విర్మానీ తెలిపారు. అనంతరం అరవింద్ విర్మానీని చాంబర్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. చాంబర్ ఉపాధ్యక్షులు వి.వి.కె.నరసింహారావు, దర్శి శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి వక్కలగడ్డ శ్రీకాంత్, కోశాధికారి తమ్మన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు ఈమని దామోదర్, బాలకిషన్ లోయ పాల్గొన్నారు.