
రేపు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర
● విద్యా సంస్థల్లో ఎకో క్లబ్‌లను క్రియాశీలం చేయాలి ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం శ్ఙ్రీప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాంశ్రీశ్రీ అనే ఇతివృత్తంతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో పాటు వివిధ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాల విజయవంతానికి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం ప్రత్యేక థీమ్‌తో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు మార్గదర్శకాలు ఇచ్చిందని, ఇందులో భాగంగా ఈ నెల ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్‌తో కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు, కరపత్రాలు, కళా ప్రదర్శనలు, డిజిటల్ కంటెంట్ తదితరాల ద్వారా ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ దుష్పరిణామాలు, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో గ్లాస్ బాటిల్స్, క్లాత్ బ్యాగ్స్, పేపర్ ప్యాకింగ్ వంటి వాటిని ప్రోత్సహించాలన్నారు. రైతు బజార్లు, అన్ని రకాల దుకాణాల్లోనూ పాలిథిన్ సంచులు ఉపయోగించకుండా పటిష్ట పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఎకో క్లబ్‌లను క్రియాశీలం చేసి ప్లాస్టిక్ రహిత క్యాంపస్‌లుగా తీర్చిదిద్దేలా ప్రోత్సహించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా జాగృతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సమావేశంలో డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.