
మంత్రి కొల్లుకు మహిళల సెగ
● జెడ్పీ చైర్‌పర్సన్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన ● చీపురులతో ఆయన ఫొటోలను కొడుతూ నిరసన
మచిలీపట్నంటౌన్: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు మహిళల సెగ తగిలింది. కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికను కొల్లు రవీంద్ర మహానటిగా అభివర్ణిస్తూ, తోటి బీసీ మహిళను చులకనగా మాట్లాడడాన్ని నిరసిస్తూ మహిళలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర నివాసానికి సమీపంలోని జవ్వారుపేట సెంటర్లో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా చీపురులను చేపట్టి మంత్రి కొల్లు రవీంద్ర ఫొటోలను కొడుతూ నిరసన తెలిపారు. బీసీ ద్రోహి కొల్లు రవీంద్ర.., డౌన్ డౌన్ కొల్లు రవీంద్ర.., మహానటుడు కొల్లు రవీంద్ర.., జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికకు మంత్రి రవీంద్ర క్షమాపణ చెప్పాలి.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనుకోని ఘటన జరగడంతో మానసిక ఒత్తిడికి గురై కంట తడి పెట్టిన హారికను మహానటిగా అభివర్ణించడం ఆయన కుసంస్కారానికి నిదర్శనం అని అన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ హారికకు మంత్రి కొల్లు రవీంద్ర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం మచిలీపట్నం సౌత్ అధ్యక్షురాలు కర్రా స్వప్న, పలువురు మహిళా కార్పొరేటర్లు, పలు డివిజన్లకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.