
ఆశలు ఆవిరి
తడారిన మడి..
నీళ్లు లేక నెర్రెలిచ్చిన చివరి ఆయకట్టు భూములు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వ నిర్లక్ష్యం కృష్ణా డెల్టా రైతులకు శాపంగా మారింది. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులు చేయకపోవడంతో రైతుకు కన్నీరు మిగులుతోంది. అనువైన సమయంలో మిన్నకుండిపోయిన ప్రభుత్వం.. కాలువలకు నీటిని విడుదల చేసే సమయంలో నిధులు మంజూరు చేసి, చేతులు దులుపుకొంది. ఇప్పుడు పనులు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాలువలు తూటికాడ, గుర్రపుడెక్క పూడికతో నిండి ఉండటంతో సాగునీరు సక్రమంగా పారడం లేదు. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు అందటం గగనంగా మారింది. దీనికి తోడు తీవ్ర వర్షాబావం నెలకొనడంతో భూములు నెర్రెలు చీలాయి. ఎద పద్ధతిలో సాగు చేసిన వరి కళ్లముందే ఎండిపోవటం చూసి రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. అరకొరగా వేసిన వరి నాట్లు ఎండిపోతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
ఆ మూడు నియోజకవర్గాల్లో..
ప్రధానంగా కృష్ణా జిల్లాలోని పెడన, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో రైతులు సాగునీరందక విలవిల్లాడుతున్నారు. పెడన, బంటుమిల్లి మండలాల్లో ఒకసారి వెద పద్ధతిలో వేసిన వరి పంట దెబ్బతినడంతో, రెండోసారి వేసుకునేందుకు కొందరు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. మురుగు డ్రెయిన్ల సమీపంలో ఉన్న రైతన్నలు ఆ నీటిని తోడుతూ పంటను బతికించుకుంటున్నారు.
కాలువల్లో నీరు పారడం లేదు..
బందరు, రైవస్, కేఈబీ, ఏలూరు కాలువలు తూటికాడ, గుర్రపు డెక్కతో నిండి ఉన్నాయి. పిచ్చిమొక్కల తొలగింపుతోపాటు, అక్కడక్కడ కాంక్రీట్ పనులు, షట్టర్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటి కోసం కోసం రూ. 26.03కోట్ల విలువైన 650 పనులను మంజూరు చేశారు. కానీ కాలువలకు సాగు నీరు విడుదల చేస్తుండటంతో నిర్వహణ పనులు చేసే అవకాశం లేకుండా పోయింది. వర్షాలు వస్తే, డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటికిపోక అల్లాడిపోయే పరిస్థితులున్నాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్‌ఎస్ మేజర్ డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకోడు, వన్నేరు, ముస్తాఫా కోడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకోడు డ్రెయిన్లలో గుర్రపుడెక్క, నాచు, తూడు దట్టంగా పేరుకుపోయి మురుగు నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి నెలకొంది.
ఖరీఫ్ ఆదిలోనే తీవ్ర ఆటంకాలు కాలువల్లో ముందుకు సాగని నీరు కనీసం తూటికాడ, పూడికతీయక సమస్యలు నోళ్లు తెరుస్తున్న భూములు.. ఎండుతున్న నారు విలవిల్లాడుతున్న అన్నదాతలు మురుగునీటితోనే సాగు చేస్తున్న వైనం
ఎండుతున్నాయి..
నేను 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశా. ఇప్పటి వరకు ఎకరాకు రూ.7వేలు చొప్పున రూ.28వేలు పెట్టుబడి పెట్టా. ఒకపక్క నీరు లేక, మరో పక్క వర్షాలు పడక, పంటలు ఎండిపోతున్నాయి. అప్పులు చేసి మరీ వరినాట్లు వేశా. అధికారులు, పాలకులు స్పందించి శివారు గ్రామాల పొలాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలి.
– బి.మరియదాసు, కౌలురైతు, శేరీవేల్పూరు
మురుగునీటిని తోడుతున్నా..
కొంకేపూడిలో 13 ఎకరాలను కౌలుకు తీసుకొని, వెదసాగు వేశా. నీరందలేదు. పూర్తిగా ఎండిపోయింది. చేసేది లేక మోటారులు పెట్టి కొంకే పూడి డ్రయిన్‌లోని నీటిని తోడుకొని, రెండో సారి వెదసాగు వేశా. దానిని కాపాడుకునేందుకు మురుగు డ్రెయిన్‌లో నీటిని వాడాల్సి వస్తోంది. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.
– బొల్లా బ్రహ్మయ్య, కౌలు రైతు, పురిటిపాడు
కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా..
(ఎకరాల్లో)
కాలువ కృష్ణా ఎన్టీఆర్
బందరు 1.51లక్షలు –
కేఈబీ 1.38లక్షలు –
ఏలూరు 0.56లక్షలు 1,332
రైవస్ 2.17లక్షలు 425
మొత్తం 5.62లక్షలు 1,757

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి