క్రేజీ కంప్యూటర్స్‌ | - | Sakshi
Sakshi News home page

క్రేజీ కంప్యూటర్స్‌

Jul 17 2025 9:06 AM | Updated on Jul 17 2025 9:06 AM

క్రేజీ కంప్యూటర్స్‌

క్రేజీ కంప్యూటర్స్‌

ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌కి భారీ డిమాండ్‌

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. కౌన్సెలింగ్‌లో తమకు కావాల్సిన చోట సీటు రాదు అనే నమ్మకంతో చాలా మంది మేనేజ్‌మెంట్‌ కోటా కోసం కళాశాలలకు బారులు తీరుతున్నారు. ఆ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్‌ కళాశాలలు సీట్లు భర్తీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. తమ కళాశాలల్లో చేరండంటూ విద్యార్థులకు ఫోన్లు చేస్తున్నాయి.

అనుకున్న చోట సీట్లు దొరకవనే ప్రచారం

ఇటీవల విడుదలైన ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుందామని వేచి చూస్తే కోరుకున్న కళాశాలలో సీటు దొరక్కపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. సీటు విషయమై ఒక అంచనాకు వస్తే బాగుంటుందని, ముందస్తుగా కొంత అడ్వాన్స్‌ ముట్టజెప్పాలని ఆయా కళాశాలలు కోరుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ర్యాంకులతో సంబంధం లేకుండా సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌, ఎన్నారై ఇలా పలు విధాలుగా సీట్లు భర్తీ చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్‌ రావడం, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు భారీగా కొలువులను ఆఫర్‌ చేస్తుండడంతో చాలా వరకూ సీఎస్‌ఈ, దానికి అనుబంధంగా ఉండే బ్రాంచ్‌లకు డిమాండ్‌ ఏర్పడింది.

మేనేజ్‌మెంట్‌ సీట్ల కోసం..

ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు సంబంధించి జోరుగా బేరసారాలు కొనసాగుతున్నాయి. డిమాండ్‌ను బట్టి సుమారు లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయల వరకూ ఫీజును ఆయా కళాశాలలు వసూలు చేస్తున్నాయి. జిల్లాకు సమీపంలో ఉన్న కొన్ని డీమ్డ్‌ యూనివర్సిటీల్లో సీట్లు పది లక్షల వరకూ పలుకుతున్నాయి. గత మాసంలోనే ఈ సీట్ల అమ్మకాలు ప్రారంభమైనా, తాజా షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి సీట్లకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే మంచి డిమాండ్‌ ఉన్న కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన కళాశాలల్లోనూ కంప్యూటర్స్‌ అనుబంధ కోర్సుల సీట్లే భర్తీ అవుతున్నాయి. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు సీట్లు పొందడానికి సిఫారసులు సైతం చేసుకునే పనిలో ఉన్నారు.

కన్వీనర్‌ కోటాకే ప్రభుత్వ సహాయం

కన్వీనర్‌ కోటాలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తిస్తాయి. బీటెక్‌లో అన్ని బ్రాంచ్లు ముఖ్యమైనవే. విద్యార్థుల ఇష్టం మేరకూ కోర్సు ఎంచుకుని కన్వీనర్‌ కోటాలో చేరవచ్చు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకం కన్వీనర్‌ కోటాలో చేరిన వారికి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఆ దిశగా ఆలోచన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 19 వేల సీట్లు..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 32 కళాశాలలు కొనసాగుతున్నాయి. అందులో 19వేల సీట్లు ఉన్నట్లు అంచనా, ఆ సీట్లలో సుమారుగా 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లుగా కళాశాలల్లో తమ కిష్టమైన వారికి సీట్లు కేటాయించుకోవచ్చు. అయితే వీటికి సంబంధించి కొన్ని నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లను కన్వీనర్‌ కోటాలో ప్రభుత్వమే కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తుంది. 19 వేల సీట్లలో సుమారుగా ఎనిమిది నుంచి పది వేల వరకూ కంప్యూటర్స్‌ దాని అనుబంధ రంగాలకు సంబంధించిన సీట్లే ఉన్నాయి.

మేనేజ్‌మెంట్‌ కోటావైపు విద్యార్థుల మొగ్గు కౌన్సెలింగ్‌ జరుగుతుండగానే కళాశాలల బేరసారాలు ఆ సీట్లను మరింత పెంచుకునేందుకు యాజమాన్యాల ఎత్తుగడలు

సగానికిపైగా కంప్యూటర్‌ సైన్సే..

ఉమ్మడి జిల్లాలోని దాదాపుగా అన్ని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సగానికి పైగా కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లే కనిపిస్తున్నాయి. మెకానికల్‌, సివిల్‌కు పూర్తిగా డిమాండ్‌ పడిపోయింది. అలాగే ఈఈఈ, ఈసీఈ బ్రాంచ్‌లకు అంతంత మాత్రంగా చేరటానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పూర్తిగా కంప్యూటర్‌ సైన్స్‌పైనే మక్కువ చూపుతున్నారు. దాంతో ఇంజినీరింగ్‌ కళాశాలలు ఆ దిశగా తమ ప్రాంగణాల్లో సీట్లను భారీగా పెంచుకుంటున్నాయి. సాధారణంగా సీఎస్‌ఈ అనేది ఒకటి మాత్రమే కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీలకు సంబంధించిన బ్రాంచ్‌లు ఉండేవి. కానీ నేడు దానికి అనుబంధంగా ఆర్టిఫీషియల్‌ ఇంజినీరింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ వంటి సబ్జెక్ట్‌లతో కొత్త సెక్షన్లను కళాశాలల యాజమాన్యాలు తెచ్చుకుంటున్నాయి. దాంతో ఆయా కళాశాలల్లో సగానికి పైగా కంప్యూటర్స్‌ దాని అనుబంధ సీట్లే ఉంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement