
మధ్యవర్తిత్వంతో శాశ్వత పరిష్కారం
చిలకలపూడి(మచిలీపట్నం): మధ్యవర్తిత్వంతో కక్షిదారులు తమ కేసులకు శాశ్వత పరిష్కారం పొందవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘దేశం కోసం మధ్యవర్తిత్వం – చట్టపరమైన అవగాహన, ప్రచార కార్యక్రమం’ పేరుతో నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా గుడి వద్ద ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.
90 రోజుల ప్రత్యేక కార్యక్రమం..
అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు 90 రోజుల మధ్యవర్తిత్వ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీనిపై ప్రజలకు గత వారం రోజులుగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కోర్టుకు సంబంధించిన అన్ని రకాల కేసులను మధ్యవర్తిత్వం ద్వారా శాశ్వత పరిష్కారం పొందవచ్చని, దీనికి కక్షిదారులు వారి న్యాయవాదులను సంప్రదించి రాజీ కుదుర్చుకోవచ్చన్నారు. రాజీ చేసుకోవటం ద్వారా ఇరుపార్టీలు గెలిచిన వారవుతారన్నారు. ఒక్కసారి రాజీపడిన కేసుకు శాశ్వత పరిష్కారం, మరలా అప్పీలుకు వెళ్లే అవకాశం లేకుండా ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో శిక్షణ పొందిన దాదాపు 60 మంది మధ్యవర్తులు ఉన్నారని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. న్యాయమూర్తులు ఎస్. సుజాత, పి. బాబు నాయక్, జి. వెంకటేశ్వర్లు, కేవీ రామకృష్ణయ్య, కేవీఎల్ హిమబిందు, సీహెచ్ యుగంధర్, పి. సాయిసుధ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి