
రైలు కోచ్‌లలో సీసీ కెమెరాలు
ప్రయోగాత్మకంగా విజయవాడ డివిజన్‌లో ఏర్పాటు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల భద్రత దృష్ట్యా భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా అన్ని రైలు కోచ్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా విజయవాడ డివిజన్‌లోని కోచింగ్ డిపోలో విజయవాడ–లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రైలులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ నూతన సాంకేతికతను ప్రదర్శించడానికి బుధవారం గైడెడ్ మీడియా టూర్ నిర్వహించారు.
ప్రయోగాత్మకంగా..
ఈ సందర్భంగా డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ రైల్వే నెట్‌వర్క్‌లో డిజిటల్ భద్రత, ఆధునికీకరణ దిశగా ముందుకు వెళ్తోందన్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 74వేల కోచ్‌లు, 15 వందల లోకోమోటివ్‌లలో హై–డెఫినిషన్ సీసీ కెమెరాలను ఏర్పాటుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టిందన్నారు. ప్రయోగాత్మకంగా విజయవాడ డివిజన్‌లో విజయవాడ–లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌లోని రెండు ఏసీ కోచ్‌లలో సీసీ కెమెరాలను అమర్చామన్నారు. ఒక్కో కోచ్‌లో ఆరు హై–డెఫినిషన్ డోమ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద రెండు, కోచ్ లోపల మార్గంలో రెండు కెమెరాలు ఏర్పాటు చేశామని, అదే విధంగా లోకోమోటివ్‌లో ఆరు కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భద్రతా వ్యవస్థ బలోపేతం..
ఈ చొరవ కేవలం నిఘా గురించి మాత్రమే కాదని, ఇది మొత్తం భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తుందని డీఆర్‌ఎం చెప్పారు. త్వరలోనే దశలవారీగా అధిక రద్దీ మార్గాలలో నడిచే అన్ని రైళ్లలోను కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఏడీఆర్‌ఎం పీఈ ఎడ్విన్, సీనియర్ డీఎంఈ సంజయ్ అంగోతు, డిజిల్ లోకోషేడ్ డీఎంఈ జి.ఉదయ్ భాస్కర్, కోచింగ్ డిపో ఆఫీసర్ హరి శివప్రసాద్, పీఆర్‌ఓ నుస్రత్ ముండ్రూప్కర్ పాల్గొన్నారు.