
ప్రగతి సూచికలపై ప్రత్యేక దృష్టి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ), స్థూల విలువ జోడింపు (జీవీఏ) పెంపు లక్ష్యంగా రూపొందిన జిల్లా, నియోజకవర్గ దార్శనిక ప్రణాళికల లక్ష్యాలను చేరుకోవాలంటే కీలక ప్రగతి సూచికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. బుధవారం పరిశ్రమలు, ఉద్యాన, పౌర సరఫరాల శాఖల అధికారులతో స్వర్ణాంధ్ర విజన్–కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా సూచికలను గుర్తించామన్నారు. ఈ సూచికల్లో ప్రగతి మొత్తం జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ప్రగతి సూచికల్లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.
సూచికలు ఇవే..
30 శాఖలకు సంబంధించి 523 కీలక ప్రగతి సూచికలు ఉన్నాయని.. పరిశ్రమల శాఖకు 20, ఉద్యాన శాఖకు 5, ఆహారం, పౌర సరఫరాల శాఖకు మూడు సూచికలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఎంఎస్‌ఎంఈల్లో కొత్త పెట్టుబడులు, ఎగుమతుల విలువ పెంపు, పరిశ్రమల్లో ఉపాధి సృష్టి, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు తదితరాలపై పరిశ్రమల శాఖ దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా సూక్ష్మ సేద్య విస్తీర్ణం, ఉద్యాన పంట సాగు విస్తీర్ణం, ఉద్యాన పంట ఉత్పాదకతను పెంచడంపై ఉద్యాన శాఖ అధికారులు దృష్టిసారించాలన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పటిష్ట అమలు, ఎల్‌పీజీ, పీఎన్‌జీ కనెక్షన్లకు సంబంధించిన సూచికలు పౌర సరఫరాల శాఖ పరిధిలో ఉన్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు తదితరులు పాల్గొన్నారు.