
స్మార్ట్ మీటర్ల దోపిడీపై ప్రజా ఉద్యమం
మచిలీపట్నంటౌన్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపై విద్యుత్తు భారాలు మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సామాన్యులకు అండగా ఉండాలంటే ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమని సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శి వై.నరసింహారావు అన్నారు. విద్యుత్ చార్జీల పెంపుదల వ్యతిరేక ఐక్య ప్రజా వేదిక ఆధ్వర్యంలో స్థానిక బుట్టాయిపేట జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కళ్లెం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి లింగం ఫిలిప్ అధ్యక్షత వహించారు. నరసింహారావు మాట్లాడుతూ మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఒప్పుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ తెలుగుదేశం, జనసేన పార్టీలు మోదీకి సాగిలపడి ప్రజల ప్రయోజనాలను తుడిచి పెట్టే కేంద్ర ప్రభుత్వ విధానాలకు తలుపులు బార్లా తెరుస్తున్నారన్నారు. జూలై 17– 22 తేదీల మధ్య సదస్సులు నిర్వహణ, 23 – 29 తేదీల మధ్య ఇంటింటి ప్రచారం సంతకాల సేకరణ కార్యక్రమం, జూలై 30 – ఆగస్టు 4వ తేదీల మధ్య వీధి సమావేశాలు, ప్రదర్శనలు ఆగస్టు 5వ తేదీన విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
అన్ని సంఘాల నాయకుల హాజరు..
ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు జి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లను రాష్ట్రంలో బిగించకుండా చేపట్టే ఉద్యమంలో భాగంగా ప్రజా వేదిక రూపొందించిన తీర్మానాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు ప్రవేశపెట్టగా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వివిధ పక్షాల సభ్యులు చేతులెత్తి మద్దతు తెలియజేశారు. జిల్లా రైతు సంఘం కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు, గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు, టైలర్స్ అసోసియేషన్ మచిలీపట్నం నగర అధ్యక్షుడు రామాంజనేయులు, ఏఐటీయూసీ, కు ల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ, ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల సంఘం, ఐద్వా, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.