
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ భవానీపురంలోని మానవ మందిరం రోడ్డులో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రత్నాకరం జీవనసాయి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలిసిన వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం నారాయణ కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆగ్రహంతో కళాశాల వద్ద ఉన్న ఫ్లెక్సీలను చింపేసి నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, కళాశాల గుర్తింపును రద్దు చేయాలని, ప్రిన్సిపాల్, అధ్యాపకుడు ఎం.వి.రావును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారికి పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, నాయకుడు అరుణ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్‌ను అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
యాజమాన్యం స్పందించకపోవడం దుర్మార్గం
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కళాశాల మాథ్స్ అధ్యాపకుడు ఎం.వి.రావు విద్యార్థి జీవనసాయిని విద్యార్థులందరి ముందు తీవ్రంగా కొట్టడమే కాకుండా దూషించి అవమానించడం వల్లే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. జీవనసాయి ఆత్మహత్యకు పాల్పడితే యాజమాన్యం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోమల్ సాయి, నాయకులు వి.రవీంద్ర, సురేంద్ర, జి.రవీంద్ర, పి. హోసన్న, ప్రశాంత్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, బీసీఎస్‌ఎఫ్ నేతలు షణ్ముఖ్, గణేష్, సాయికుమార్, కామరాజ్ హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న విద్యార్థి సంఘం నాయకులను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నాయకుడు అడపా శేషు పరామర్శించారు.