
రెండు ఆటోలు ఢీ ఏడుగురికి గాయాలు
పులిగడ్డ(అవనిగడ్డ): స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగడ్డ టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా వేమూరుకు చెందిన కొందరు ఆటోలో మోపిదేవి ఆలయానికి వచ్చి తిరిగి వెళుతుండగా, రేపల్లె వైపు నుంచి వస్తున్న కోడిగుడ్ల ఆటో లారీని తప్పించబోయి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీరరాఘవమ్మ, కోసూరు అరుణతో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరరాఘవమ్మ, అరుణను మచిలీపట్నం తరలించగా, స్వల్పగాయాలైన మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
రూ.32 లక్షల విలువైన ఎరువులు సీజ్
తిరువూరు: సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎరువులు విక్రయిస్తున్న తిరువూరులోని రెండు ఫెర్టిలైజర్స్ దుకాణాలపై బుధవారం విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. తిరువూరులోని ఓ దుకాణంలో రూ.25,44,990 విలువైన 109.673 టన్నుల ఎరువులు, మరో దుకాణంలో రూ.7.62 లక్షల విలువైన 29,300 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు తిరువూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఏవీఎస్ రంగారావు తెలిపారు. ఫారం లేకుండా, స్టాక్ రిజిస్టరులో వివరాలు నమోదు చేయక, లైసెన్సులో సరైన సమాచారం పొందుపరచకపోవడంతో ఆయా దుకాణాల్లో గుర్తించిన ఎరువుల విక్రయాలను నిలిపివేశామన్నారు. డీలర్లు బిల్ బుక్ ఫారం, స్టాక్ రిజిస్టర్ తప్పక నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీలో విజిలెన్స్ అధికారులు హనుమంతరావు, నాగరాజు, వెంకటేష్, పద్మ, టిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

రెండు ఆటోలు ఢీ ఏడుగురికి గాయాలు