
పాడి అభివృద్ధికి పెయ్య దూడల ఉత్పత్తి పథకం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పాడి రైతులు, పాడి పరిశ్రమ అభివృద్ధికి నాణ్యమైన సెమెన్ అవసరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృష్ణా మిల్క్ యూనియన్ పెయ్య దూడల ఉత్పత్తి పథకానికి శ్రీకారం చుట్టిందని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ పరిపాలన భవనంలో బుధవారం చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలుత యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, జిల్లా పశువుల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.శ్రీనివాస్, గన్నవరం వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ వెంకట శేషయ్య, సమితి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఇప్పటి వరకు నాణ్యమైన సెమెన్ రైతులకు అందించేందుకు కృష్ణా మిల్క్ యూనియన్ చేపడుతున్న చర్యలపై చర్చించారు.
రూ.150కే సెమెన్ డోస్
అనంతరం చైర్మన్ చలసాని మాట్లాడుతూ గ్రామాల్లోని నిరుద్యోగ యువత పాడి పరిశ్రమ వైపు అడుగులు వేస్తోందన్నారు. ఎన్‌డీడీబీ సహకారంతో నాణ్యమైన సెమెన్ డోస్‌ను కేవలం రూ.150కే అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఈ వీర్యం వల్ల పుట్టిన దూడల్లో 95 శాతం పెయ్య దూడలే జన్మిస్తాయని, దీంతో రైతులు దూడలను పెంచి పాడి గేదెలుగా అభివృద్ధి చేసుకుంటారన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెలకు 70 వేలకు పైగా సెమెన్‌ను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.