
మచిలీపట్నంలో నిరుద్యోగాన్ని రూపుమాపుతాం
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నియోజకవర్గంలో చదువుకున్న యువతీ యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగాన్ని రూపుమాపుతానని, వచ్చిన ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఆవరణలో బుధవారం రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి ఆయన వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమానికి 2,328 మంది నిరుద్యోగులు హాజరుకాగా, వీరిలో వివిధ కంపెనీల్లో 646 మంది ఉద్యోగాలు పొందారు. మరో 137 మందికి తర్వాతి ఇంటర్వ్యూలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకోసారి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. 2026 జూన్–డిసెంబర్ నాటికి మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం పూర్తయి రవాణా రాకపోకలు మొదలవుతాయన్నారు. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు, సీ డాప్ జేడీఎం సుమలత, జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్ బాబు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మంత్రి రవీంద్ర