
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
తిరువూరు: ఎ.కొండూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె. కాంతారావు(40) మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తిరువూరు పట్టణ శివారులోని టౌన్‌షిప్‌లో అపస్మారక స్థితిలో ఉన్న కాంతారావును స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి తిరువూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. తిరువూరు పోలీసుస్టేషన్లో పనిచేస్తూ ఇటీవల సాధారణ బదిలీల్లో ఎ.కొండూరుకు బదిలీ అయిన కాంతారావు విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరిస్తాడని పోలీసు సిబ్బంది చెబుతున్నారు. తిరువూరు కోర్టులో కాంతారావుపై ఒక న్యాయవాది నమోదు చేసిన ప్రైవేటు ఫిర్యాదు నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారని భావిస్తున్నారు.
అప్పుల బాధతో వ్యక్తి బలవన్మరణం
పెనమలూరు: అప్పుల బాధతో ఓ వ్యక్తి కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన పాపినేని సురేష్ (56) భార్య సాయిలక్ష్మితో కలిసి ఉంటున్నాడు. అతను గత 20 ఏళ్లుగా లారీల వ్యాపారం చేస్తున్నాడు. అయితే వ్యాపారంలో నష్టం రావటంతో అప్పులపాలయ్యాడు. ఉన్న లారీలు అమ్మి అప్పులు తీర్చినా ఇంకా అప్పులు మిగిలాయి. దీంతో సురేష్ ఆందోళనలో ఉన్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటున్న కుమారుడు ప్రసాద్ తాను అప్పులు తీర్చుతానని కంగారు పడవద్దని తండ్రికి తెలిపాడు. కాగా ఈ నెల 10వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సురేష్ గడ్డిమందు తాగాడు. అనంతరం తాను గడ్డి మందు తాగానని బంధువులకు తెలపటంతో అతని వెంటే పోరంకిలో ప్రైవేటు ఆస్పత్రిలో అత్యవసర చికిత్సకై చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బందరు కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: యనమలకుదురు గ్రామ పరిధిలో బందరు కాలువలో వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడిప ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బడుగు మధుసూదనరావు(52) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య శాంతకుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన ఇంట్లో కుటుంబ తగాదాలు గత కొద్దికాలంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధుసూదనరావు సోమవారం రాత్రి యనమలకుదురు పంచాయతీ ఆఫీసు రోడ్డులో ఉన్న వంతెన వద్దకు వచ్చి చెప్పులు వదిలి బందరు కాలువలో దూకాడు. బందరు కాలువలో నీరు ఎక్కువగా ప్రవహించటంతో ఇదిచూసిన స్థానికులు అతనిని రక్షించలేక పోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మంగళవారం రంగంలోకి దింపి బందరు కాలువలో గాలింపు చేపట్టారు. అయితే గ్రామ పరిధిలో ఉన్న జన్మభూమి వంతెన వద్ద కాలువలో మధుసూదనరావు మృతదేహాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్ గుర్తించి, బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీ ఫ్లెక్సీలు కడుతూ యువకుడు దుర్మరణం
పెనమలూరు: టీడీపీ ఫ్లెక్సీలు యువకుడిని బలిగొన్నాయి. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోరంకిలో టీడీపీకి చెందిన సొసైటీ సభ్యుల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో దానికి సంబంధించిన ఫ్లెక్సీలను సోమవారం అర్ధర్రాత్రి కానూరుకు చెందిన యువకుడు బి.ప్రమోద్(19) కడుతున్నాడు. ఈ క్రమంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప రాడ్ విద్యుత్ తీగలకు తగిలింది. ఈ ఘటనలో ప్రమోద్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గాయపడిన ప్రమోద్‌ను ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు కడుతున్నవారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం