
కొనసాగుతున్న ఆషాఢ సంబరం
దుర్గమ్మకు ప్రసాదాల పోటు, నాయీ బ్రాహ్మణుల సారె సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకొని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రసాదాల పోటు, కేశఖండనశాల నాయీ బ్రాహ్మణులు మంగళవారం అమ్మవారికి సారెను సమర్పించారు. తొలుత జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారికి ప్రసాదం పోటు సిబ్బంది పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ప్రసాదాల పోటు నుంచి సారెతో ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు.
కేశఖండనశాల నుంచి..
దుర్గాఘాట్ ఎదుట ఉన్న కేశఖండనశాల నుంచి సారె బయలుదేరగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు, పరిపాలనా సిబ్బంది ఊరేగింపులో పాల్గొన్నారు. సుమారు నాలుగు వందల మంది నాయీబ్రాహ్మణుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అమ్మవారికి సారె సమర్పించిన వారిలో రాష్ట్ర దేవాలయాల కేశ ఖండన కార్మికుల జేఎసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాసు, రాలి వెంకట రమణ, నారాయణ, గుంటుపల్లి హరి, కిరణ్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ప్రసాదాల పోటు, కేశఖండనశాల సిబ్బందిని ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు జరిపించుకున్న అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పించారు. అమ్మవారి దయతో భక్తులందరూ, ఆలయ అధికారులు, సిబ్బంది సుఖ సంతోషాలతో ఉండాలని ఏటా సారె సమర్పిస్తామని సిబ్బంది పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు ఎన్. రమేష్‌బాబు, చంద్రశేఖర్, తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.