
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
చిలకలపూడి(మచిలీపట్నం): రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు గుడివాడ రామస్వామి అన్నారు. ధర్నా చౌక్ వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్‌మెంట్ బిల్లును రద్దు చేయాలన్నారు. పెన్షనర్లకు చాలా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రస్తుతం మూడు డీఏలు పెండింగ్ ఉన్నాయని, నాల్గో డీఏ కూడా చెల్లించాల్సి న సమయం వచ్చినప్పటికీ ఇంత వరకు ఒక్క డీఏ కూడా చెల్లించలేదన్నారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే అమలు చేయాలన్నారు. రైల్వే, విమాన ప్రయాణాల్లో సీనియర్ సిటిజెన్స్ రాయితీని పునరుద్ధరించాలన్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు కాంప్రెహెన్సివ్ హెల్త్ ఇన్‌స్యూరెన్స్ స్కీంను అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. సంఘ ప్రధాన కార్యదర్శి ఏవీ ప్రసాదరావు, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, బి. శంకర్‌నాథ్, రామకృష్ణ, పి. శ్రీనివాసరావు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.